నాగమల్లే దారిలో.. ఎన్ని పూలపాటలో..

నింగిలో మొలిసే సింగిడి ఏ దేవుడు జేసిండో గానీ.. పెత్రామాస నాడు నేల మీద ఆడబిడ్డలు తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మలు మాత్రం ఆ సింగిడి కంటే ముద్దుగుంటయ్. రంగురంగుల మెరుపులతో నింగినే నేలకు దించుతయ్. ఆ రంగుపూల బతుకమ్మ పండుగ పాటలు.. పరవళ్లు తొక్కుతూ.. నేలంతా పరుచుకొని.. తంగెడులై పూస్తయి.. రాగాలై పాడుతయి. పూలను పూజించే ప్రత్యేక సంప్రదాయం బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పాట రంగులు పూసుకొని ప్రపంచమంతా చుట్టి వస్తున్నది.ఇదిగో.. ఈ యేడు బతుకమ్మ పాటల ఊట.. bathukamma బతుకునియ్యమ్మా.. బతుకమ్మా.. బతుకుదెరువునియ్యమ్మా.. బతుకమ్మా అంటూ సాగే బతుకమ్మ పాటే ఇప్పుడు ఎంతోమందికి బతుకుదెరువు అయింది. పచ్చని పల్లె.. రంగుల చీర కట్టుకున్నట్టు.. సప్పట్ల సవ్వడికి ఆడబిడ్డల గాజులు గల్లున మోగుతూ.. అడుగుల సవ్వడికి కాలిగజ్జెలు మురిసే పండుగ ఏదైనా ఉన్నదంటే అది బతుకమ్మ పండుగే. వేల భావోద్వేగాల నడుమ.. లక్షల రంగుల పూలు పేర్చి.. కోటి కాంతులతో ఈ తొమ్మిది రోజులూ పల్లె బతుకమ్మ కాంతులతో మెరిసి మురిసిపోతది. ఆడబిడ్డలు అలవోకగా రాగాలు తీసి బతుకమ్మ పాటలు కైగట్టి పాడుతుంటే.. ఆ సప్పట్ల నడుమ పూలన్నీ కొత్త కాంతులు సంతరించుకుంటయి. ఒకప్పుడు బతుకమ్మ పాట, బతుకమ్మ పండుగను నిర్వీర్యం చేయాలని చూస్తే.. అదే బతుకమ్మ పండుగ ఉద్యమమై ఎగిసింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ముందుండి నడిపించింది. నేడు.. సొంత రాష్ట్రంలో బతుకునిచ్చే ఉపాధి మార్గమయింది. ఆడబిడ్డల సహజ సృజనాత్మకతకు కొత్త కాంతులు అద్దుతూ బతుకమ్మ పాట.. నేడు ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్నది. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన బతుకమ్మ నేడు.. టీవీల్లో రంగుపూల సింగిడై విరాజిల్లుతున్నది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. ఎంగిలిపూల బతుకమ్మ నాడే భారీ కెమెరాలు, అద్భుతమైన సంగీతం, నృత్యాలతో షూట్ చేసి బతుకమ్మ పాటను టీవీలు, యూట్యూబ్‌లలో విడుదల చేస్తున్నారిప్పుడు. వీ6తో దాము కొసనం మొదలుపెట్టిన బతుకమ్మ పాటల ట్రెండ్ ఇప్పుడు అన్నీ టీవీ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లకు పాకింది. గాయకులు, సంగీత దర్శకులు, డ్యాన్సర్లు, కెమెరామెన్లకు ఉపాధినిచ్చే బతుకుబాటగా మారింది బతుకమ్మ. కురిసే వానలతో.. వాగులన్నీ పారినయీ.. సిరుల చెరువులతో బావులన్నీ నిండినయీ అంటూ.. మైక్ టీవీ వారు ఈ సంవత్సరం యూట్యూబ్‌లో విడుదల చేసిన బతుకమ్మ పాట ఎక్కువ ఆదరణకు నోచుకుంది. పాటలో రాసిన పదాలు అనుబంధాలను, బతుకమ్మ పాట సంబురాలను కండ్లకు కట్టేలా ఉన్నాయి. మంగ్లీ గొంతు, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. సమర్పణ : మైక్ టీవీ డైరెక్షన్ : దామురెడ్డి కొసనం లిరిక్స్ : నందిని సిధారెడ్డి మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి గానం : మంగ్లీ (సత్యవతి) పచ్చని పల్లెల పూవులు పూయంగా.. ఆ పూసిన పూలకు రంగులు పులమంగా అంటూ ముచ్చటపడి పూసిన తంగెళ్లు, గూనుగుపూలను ప్రేమతో అన్నదమ్ములు తెంపుకొచ్చిన పూలను రంగుపూల పర్వతాలు పేర్చే అక్కాచెల్లెండ్ల అనుబంధాన్ని కండ్లకు కట్టారు. పల్లెల్లో బతుకమ్మ పండుగ సంబురాన్ని చూపించారు. ఈ యేడాది ఎక్కువమంది చూస్తున్న బతుకమ్మ పాటల వీడియోల జాబితాలో ఈ పాట కూడా ఉన్నది. సమర్పణ : 6టీవీ డైరెక్షన్ : చందు తూటి ప్రొడ్యూసర్ : సురేష్ రెడ్డి యేలేటి లిరిక్స్ : ముక్కెర సంపత్‌కుమార్ మ్యూజిక్ : బోలే శావలి గానం : వాణికిశోర్ వొల్లాల, బోలే శావలి గరిమళ్ల బతుకుల్ల గన్నేరు పువ్వు గౌరి గౌరమ్మలో.. తీరొక్క పువ్వై మాగలుమకొచ్చె గౌరి గౌరమ్మలో అంటూ పచ్చని పసుపులో పుట్టిన గౌరమ్మ, పువ్వులో పుట్టిన బతుకమ్మను పూజించే పండుగను మనసుకు హత్తుకునేలా చూపించారు. పండుగ ముందు, పండుగ తర్వాత పల్లె అందాన్ని వర్ణించిన తీరు బాగుంది. సమర్పణ : వీ6 డైరెక్షన్ : గోవింద్ లిరిక్స్ : కందికొండ మ్యూజిక్ : బోలే శావలి గానం : వరం, బోలే శావలి రంగుపూల రాశులెల్ల నవ్వులొంపెనే.. నింగి సింగిడొంగి పొంగి నాట్యమాడెనే అంటూ గోరటి వెంకన్న రాసిన ఈ బతుకమ్మ పాట పల్లెతనాన్ని, రంగుపూల బతుకమ్మ పండుగను వర్ణించింది. సమర్పణ : టీవీ1 డైరెక్షన్ : అంతుడుపుల నాగరాజు లిరిక్స్ : గోరటి వెంకన్న మ్యూజిక్ : యశో క్రిష్ణ గానం : స్వర్ణక్క, యశో క్రిష్ణ ఓ పువ్వుల బొమ్మా.. శివుని ముద్దులగుమ్మా.. నీ కొరకై పూచెనే తంగెడు కొమ్మా అంటూ తెలంగాణ గుండెచప్పుడు టీన్యూస్ ఈ పండుగ సందర్భంగా చానె ల్లో, యూట్యూబ్‌లో విడుదల చేసిన బతుకమ్మ పాట ఆకట్టుకుంటున్నది. సమర్పణ : టీన్యూస్ డైరెక్షన్ : మధు బండి రచన, గానం : మిట్టపల్లి సురేందర్ మ్యూజిక్ : యస్.యస్. రాజేష్ పువ్వు కోసి.. పూలరాశి జేశి.. పచ్చానకు పేర్చి.. పువ్వు పేర్చి అంటూ తెర మీద తనదైన శైలిలో వార్తలందించే బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్ ఈ ఏడాది బతుకమ్మ పాటతో యూట్యూబ్‌లో అలరించాడు. పూలపండుగ వైభవాన్ని చెప్తూ స్వయంగా పాట పాడాడు. డైరెక్షన్ : అనిల్ కందుకూరి లిరిక్స్ : కందికొండ మ్యూజిక్ : నందన్‌రాజ్ బొబ్బిలి గానం : బిత్తిరి సత్తి (రవి కుమార్) పల్లె మట్టి వాసన నువ్వే.. ఆ మట్టిలోని చెట్టువు నువ్వే అంటూ హెచ్‌ఎంటీవీ వారు కూడా బతుకమ్మ పాట వీడియో చేశారు. బతుకమ్మ ఎలా పుట్టిందో వర్ణిస్తూ ఆడబిడ్డల ఆటపాటల నడుమ సాగే ఈ పాట వీడియోను లక్షమంది చూశారు. డైరెక్షన్ : రత్నకుమార్, లిరిక్స్ : కందికొండ, సంగీతం, గానం : బోలే శావలి కొమ్మకొమ్మల దాన.. అడవీ అందాల జాన అంటూ 10టీవీ ఈ ఏడాది కూడా బతుకమ్మ పాట రూపొందించింది. డైరెక్షన్ : అనిల్ కందుకూరి లిరిక్స్ : అభినయ్ శ్రీనివాస్ మ్యూజిక్ : యశోక్రిష్ణ గానం : శంకర్‌బాబు, పద్మావతి, రాంకీ ఒక్కొక్క పువ్వు.. తీరొక్క పువ్వు.. తంగెడుపువ్వు.. గూనుగు పువ్వు.. అంటూ తేలు విజయ, గోవుల్లో.. పూవుల్లో గవ్వల గౌరమ్మ కొడారి శ్రీను బాణీలకు ఏముల శృతి గొంతు కలిపి పాడిన బతుకమ్మ పాట ఆకట్టుకుంది. తీన్మార్ పాటలతో బోనాల పండుగ జోష్‌ను పెంచే డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు కూడా భాగ్యాల తల్లీ బతుకమ్మా.. గారాల తల్లి గౌరమ్మ అంటూ మధుప్రియతో పాడించిన పాట అద్భుతంగా ఉంది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో చిన్న చిన్న టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ బతుకమ్మ పాటకు దృశ్యరూపం ఇచ్చి యూట్యూబ్‌లో విడుదల చేశారు. బతుకమ్మ పాట మీద ప్రేమతో అన్నీ పాటలను ఆహ్వానిస్తూ.. అందరి పాటలను ప్రోత్సహిస్తున్నారు నెటిజనులు. పూలపండుగలోని అందాన్ని కండ్లార్పకుండా చూడడాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి. అందుకే.. బతుకమ్మ పండుగ పూలపల్లకీ ఎక్కీ యూట్యూబ్ వేదికగా ప్రపంచమంతా ఊరేగుతున్నది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్తున్నది. ప్రవీణ్‌కుమార్ సుంకరి
× RELATED ప్యారీ.. పూరీ!