దేశంలోనే తొలిసారిగా..

ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు సామాన్యులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తారు. పోలీసుల విషయం అయితే చెప్పనక్కర్లేదు. వారు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేస్తారు. దేశంలోనే తొలిసారిగా 36 మంది అమ్మాయిలతో స్వాట్ టీమ్ ఏర్పాటైంది. వాళ్లేం చేస్తారంటే..

స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(ఎస్‌డబ్ల్యూఏటీ) పేరుతో దేశంలోనే మొదటి మహిళా పోలీసు బృందం శిక్షణ పూర్తి చేసుకున్నది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా వీళ్లు సేవలందిస్తారు. దేశంలోని పలు రాష్ర్టాల నుంచి మొత్తం 36 మందిని ఎంపిక చేశారు. జరోడా కలన్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో వీళ్లు శిక్షణ పొందారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ ఈ బృంద బాధ్యతలు చూసుకోనున్నారు. అసోం నుంచి 13మంది, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 5గురు, సిక్కిం 5మంది, మణిపూర్ నుంచి 5గురు, మేఘాలయా నుంచి నలుగురు, నాగాలాండ్ నుంచి ఇద్దరు, మిజోరం, త్రిపురల నుంచి ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. ఈ కమాండోలు మొత్తం పదిహేను నెలల ట్రైనింగ్‌లో ఇతర దేశాలకు కూడా వెళ్లి వచ్చారు. పట్టణ పరిస్థితులే కాకుండా అడవి ప్రాంతాల్లో జరిగే కూంబింగ్‌లలో కూడా పాల్గొంటారు. అన్ని యుద్ధ విద్యల్లో నైపుణ్యం సాధించారు. వీవీఐపీలకు భద్రత అందించడంతో పాటు ఆకస్మికంగా దాడులు జరిగినా ఎదుర్కొని మూకల తోక ముడిచి పరిగెత్తించగల సామర్థ్యాన్ని సంపాదించారు. పదిహేను నెలల శిక్షణా కాలంలో పేలుళ్లు జరిగినప్పుడు ఎలా స్పందించాలన్న విషయాల్లో కూడా ఆరితేరారు. అడ్వాన్స్‌డ్ ఆయుధాలైన ఎంపీ5, గ్లాక్21 వంటి వాటిని వాడుతారు. మొదటి విడుతగా వీళ్లు ఢిల్లీలోని ఎర్రకోట, ఢిల్లీ సెంట్రల్ ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటారు. భవిష్యత్తులో మరింతగా విస్తరించనున్నారు.

Related Stories: