దాల్ చావల్ అచార్..

మోడ్రన్ లైఫ్‌తో పాటు ఫుడ్‌లో కూడా మోడ్రనిటీ పెరుగుతున్నది. థీమ్ రెస్టారెంట్లతో పాటు సేమ్ రెసిపీలు కాకుండా థీమ్ రెసిపీలను అందిస్తున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఫర్జీ కేఫ్ కూడా అలాంటి అల్ట్రా మోడ్రన్ రెస్టారెంటే. సరికొత్త ఆహారాన్ని పరిచయం చేస్తున్న రెస్టోరివ్యూ.

ఆహారం అంటే రుచి, శుచి ఉండాలని కోరుకుంటారు చాలామంది. కొన్ని చోట్ల శుచి ఉంటే రుచి ఉండదు. ఇంకొన్ని చోట్ల రుచి ఉంటుంది కానీ శుచి, రెస్టారెంట్ వాతావరణం బాగుండవు. రుచి, శుచిల కలయికతో పాటు ప్రశాంతమైన వాతావరణం, వినసొంపైన సంగీతం ఉండే రెస్టారెంట్ ఫర్జీ కేఫ్. రెస్టారెంట్లకు ఇంటీరియర్ ఎంత ముఖ్యమో ఫుడ్ ప్రజెంటేషన్ అంతే ముఖ్యం. ఫర్జీ కేఫ్‌లో ఫుడ్ ప్రజెంటేషన్ చూస్తే వహ్వా అనక మానరు. ప్రతీ రెసిపీకి భిన్నమైన కూరగాయలతో విభిన్నమైన గార్నిషింగ్ ఇస్తారు.

అల్ట్రా మోడ్రన్

నగరంలో భోజనప్రియుల ఆకలి తీర్చేందుకు మరో రెస్టారెంట్ వచ్చేసింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ముందు లైన్ ఫర్జీ కేఫ్ పేరుతో సరికొత్త హోటల్ తీరొక్క తిండిని పరిచయం చేస్తున్నది. ఇది బయటికి ఏదో కార్పొరేట్ కంపెనీలా, గొప్పోళ్ల భవంతిలా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, గోడలన్నీ మొక్కలతో అలంకరించి ప్రశాంతంగా ఉంటుంది. 2017 నవంబర్ 29న ఫర్జీ ప్రారంభమైంది. నగరంలో నలుమూలల నుంచి ఫుడ్ లవర్స్ ఇక్కడి టేస్ట్ కోసం ముందే రిజిస్టర్ చేసుకొని మరీ ఆర్డర్స్ ఇస్తున్నారు. 275 మంది కూర్చుని తినగల సామర్థ్యం ఉన్న అల్ట్రా మోడ్రన్ రెస్టారెంట్ ఇది. 22 మంది చెఫ్స్ కిచెన్‌లో వంటలు చేస్తారు. 22 మంది వెయిటర్స్ పనిచేస్తున్నారు. వీటితో పాటు త్వరలోనే పా పా యా పేరుతో మల్టీ కుజైన్ రెస్టారెంట్ తెరువాలనుకుంటున్నారు. భవిష్యత్తులో ఫర్జీ కొత్త బ్రాంచ్ గచ్చిబౌలి ప్రాంతంలో కూడా ఒకటి ప్రారంభించాలనుకుంటున్నారు.

ఆహారమంతా ప్రత్యేకమే

వేడి వేడి అన్నం, పప్పు, మామిడికాయ తొక్కు కాంబినేషన్ ఎట్లుంటది? చదువుతుంటేనే నోరూరుతుంటుంది. దాల్ చావల్ అచార్‌ని పేరుతో ఉన్న వంటకం మన తెలుగింటి వంటకంలా, అచ్చం ఇంట్లో అమ్మ చేసిన అన్నంలా ఉంటుంది. మిస్తీ డోయి అనే వెల్‌కమ్ డిజర్ట్ మీరెప్పుడు తిని ఉండరు. అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇలాంటి డిషెస్ ఇక్కడ చాలానే ఉంటాయి. ప్రతీ మూడు నెలలకొకసారి మెనూ మారుస్తారు. దేశీయ వంటలకు తెలంగాణ ఫ్లేవర్ అద్దితే ఎలా ఉంటాయో ఫర్జీలో అన్ని వంటకాలూ దాదాపు అలాగే ఉంటాయి. ఇక చివరగా వాళ్లిచ్చే పాన్ ఇంకా ప్రత్యేకం. పాన్ ప్లేవర్ క్యాండీ అది. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. ఫుడ్‌తో పాటు ఇక్కడ మాక్‌టెయిల్స్ కూడా యమ్మీగున్నాయి. ప్రూట్ ఫ్లేవర్స్‌తో పాటు ఢిపరెంట్ ఫ్లేవర్స్ మాక్‌టెయిల్స్ కూడా ఉంటాయి.