దర్యాప్తులో ఉదాసీనత

సాధారణంగా మహిళలు తమపై లైంగికదాడి జరిగిందని ధైర్యంగా ఆరోపణలు చేయడానికి జంకుతారు. లైంగికదాడికి గురైన వారిని బాధితురాలిగా చూసి సాంత్వన కలిగించడానికి బదులు, అవమానకరంగా చూస్తారనే భయం వల్ల చాలా లైంగిక నేరాలు వెలుగులోకి రావు. లైంగికదాడి గురైన మహిళ శీలంపై అనుమానం కలిగే ఆరోపణలు చేయడం ద్వారా అవతలిపక్షం తమ వాదనను నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేరళ నన్ విషయంలోనూ ఇటువంటి ధోరణే కనిపిస్తున్నది. కేరళలోని ఒక నన్ తనపై బిషప్ (క్రైస్తవ మతాధికారి) లైంగికదాడికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి విమర్శలకు తావిస్తున్నది. లైంగిక దాడికి పాల్పడిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్య తీసుకోవాలంటూ 43 ఏండ్ల వయసుగల ఈ బాధితురాలికి మద్దతుగా మరికొందరు నన్‌లు కూడా హైకోర్టు బయట నిరసన ప్రదర్శన సాగిస్తున్నారు. 2014లో బిషప్ తనను అధికారిక విషయాలు చర్చించడానికంటూ పిలిపించి లైంగికదాడికి పాల్పడ్డారనీ, ఆ తర్వాత రెండేండ్లపాటు తనపై పదమూడు సార్లు లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను బిషప్ తిరస్కరించారు. ఆమెకు ఒక వివాహితుడితో లైంగిక సంబంధం ఉందనీ, అతడి భార్య ఫిర్యాదు మేరకు ఈమెను విచారించానని ఆయన అంటున్నారు. తాను ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టినందుకే కక్షతో తనపై ఈ లైంగికదాడి ఆరోపణలు చేస్తున్నదని ఆయన అంటున్నారు. బిషప్, నన్ ఇరువురూ గౌరవప్రదమైన వ్యక్తులు. వారిపట్ల సమాజంలో ఆరాధనాభావం ఉంటుంది. ఈ వివాదంలో దోషులెవరనేది దర్యాప్తు పూర్తయి, న్యాయస్థానం తీర్పు ఇస్తే కానీ తెలువదు. కానీ తనపై లైంగికదాడి జరిగిందని ఒక స్త్రీ ఆరోపించినప్పుడల్లా ఆమె పట్ల సమాజం, చట్టబద్ధ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటున్నది. కేరళ నన్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం, ఇతర పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ను ఆ పదవి నుంచి తప్పించి, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని బాధితురాలు, ఆమెకు మద్దతు ఇస్తున్న నన్‌లు కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు మత సంస్థ ఆయనపై చర్య తీసుకోలేదు. పైగా బిషప్‌కు వ్యతిరేకంగా బయ టిశక్తులు కుట్ర పన్నుతున్నాయనే ఆరోపణ మత సంస్థ వర్గాల నుంచి వెలువడింది. సీనియర్ మతాధికారులకు ఈ ఉదంతంలో తమదైన అభిప్రాయం ఉండవచ్చు. దానిని విమర్శించే వారూ ఉండవచ్చు. ఆయనపై చర్య తీసుకోవడమనేది మత సంస్థకు సంబంధించి న అంశం. కానీ నేరం జరిగింది మన దేశంలో. ఇక్కడ చట్టబద్ధపాలన సాగుతున్నది. ప్రభు త్వం, న్యాయవిచారణ వ్యవస్థ ఉన్నాయి. ఈ వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలె. కానీ నన్ తనపై లైంగికదాడి జరిగిందని పోలీసులకు జూన్ 27వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండున్నర నెలలు గడిచినా ఇప్పటి వర కు పోలీసులు బిషప్‌ను అరెస్టు చేయలేదు. బిషప్‌ను ఒక్కసారి మాట వరుసకు విచారించి, బాధితురాలిని మాత్రం పదిసార్లు ప్రశ్నించడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమనే ఆరోపణలు వినబడుతున్నాయి. బాధితురాలిని అదేపనిగా ఇంటరాగేట్ చేయడం ద్వారా ఆమె వివరణల్లో తేడాలుంటే, దొరుకబట్టి కేసును బలహీనపరిచే ఉద్దేశం ఉందని అంటున్నారు. ఈ కేసు విషయంలో తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించవలసి వచ్చింది. తదుపరి విచారణ ఈ నెల పదమూడవ తేదీన ఉన్న నేపథ్యంలో, ఒకరోజు ముందే పోలీసుల్లో కదలిక కనబడ్డది. బుధవారం నాడు ఆరు గంట ల పాటు ఉన్నతస్థాయిలో తర్జనభర్జనలు జరిపి బిషప్‌ను ఈ నెల పందొమ్మిదవ తేదీన దర్యాప్తు బృందం ముందు హాజరుకావాలని ఆదేశించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం రాజకీయంగా దెబ్బతింటామనే భయంతో మతాధికారిపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదనే విమర్శలున్నాయి. కానీ ఈ ఉదంతాన్ని కూడా లైంగికదాడి ఆరోపణగా చూడాలే తప్ప, మతకోణంలో కాదు. బాబాలు, స్వామీజీలు, బిషప్‌లు-ఆరోపణలు ఎవరిపై వచ్చినా చట్టప్రకారం చర్య తీసుకోవలసిందే. బిషప్ ప్రాబల్యం, ధనబలం వల్ల రాజకీయ వర్గాలు, పోలీసు యంత్రాంగం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించ లేక పోతున్నాయని నన్‌లు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మహిళలు తమపై లైంగికదాడి జరిగిందని ధైర్యంగా ఆరోపణలు చేయడానికి జంకుతారు. లైంగికదాడికి గురైన వారిని బాధితురాలిగా చూసి సాంత్వన కలిగించడానికి బదులు, అవమానకరంగా చూస్తారనే భయం వల్ల చాలా లైంగిక నేరాలు వెలుగులోకి రావు. లైంగికదాడి గురైన మహిళ శీలంపై అనుమానం కలిగే ఆరోపణలు చేయడం ద్వారా అవతలిపక్షం తమ వాదనను నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేరళ నన్ విషయంలోనూ ఇటువంటి ధోరణే కనిపిస్తున్నది. బిషప్‌కు మద్దతుగా ఉన్న ఒక ఎమ్మెల్యే నన్ వ్యభిచారి అంటూ, ఆమె మొదటిసారి లైంగికదాడి జరిగినప్పుడే ఎందుకు ఆరోపణలు చేయలేదని అభ్యంతరకర పదజాలంతో మాట్లాడారు. ఒక మతాధికారిపై సాధారణ నన్ ధైర్యం గా ఆరోపణలు చేయడం అంత సులభం కాదు. ఆరోపణలు చేయడంలో జాప్యం అయిందనేది సహేతుకమైన వాదన కాదు. మతాధికారులపై లైంగికదాడి ఆరోపణలు రావడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. కేరళలో కూడా ఇటువంటి ఆరోపణలు కొత్త కాదు. 1992 నాటి సిస్టర్ అభ య హత్యోదంతం ఇప్పటికీ ఎటూ తేలలేదు. తాజా కేసులో నన్ ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే, మహిళలు తమపై దాడులను ధైర్యంగా వెల్లడించగలుగుతారు.