తొలి ముస్లిం పైలెట్

ఆధునిక కాలంలో కూడా ముస్లిం చిన్నారులు, యువతులు పెద్ద చదువులు చదువుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఆడపిల్లలను బయటికి పంపించాలంటేనే భయపడే కుటుంబం నుంచి పైచదువులు చదివి..తొలి ముస్లిం మహిళా పైలెట్‌గా చరిత్రకెక్కింది ఈ యువతి.
కశ్మీర్‌కు చెందిన ఈ యువతి పేరు ఇరమ్ హబీబ్. తనకు చిన్నప్పట్నుంచీ పైలెట్ అవ్వడమంటే చాలా ఇష్టం. ఎవరైనా నువ్ భవిష్యత్‌లో ఏమవుతావు అని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా పైలెట్ అవుతా అని సమాధానం చెప్పేది. ఆడపిల్లల్ని చదివించడానికే భయపడే ముస్లిం కుటుంబంలో పుట్టింది హబీబ్. ప్రాథమిక విద్యనభ్యసించేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. అయినా, చదువులో బాగా రాణించేది. చదువు, ఆటలు, పాటల్లో ముందుండేది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో సర్జరీ ఎక్విప్‌మెంట్న్‌ను సప్లయి చేసే హబీబ్ తండ్రి.. తన కూతురు ప్రతిభను గుర్తించాడు. ఆ సమయంలోనే తను పైలెట్ అవ్వాలన్న కోరికను తండ్రికి చెప్పింది. ఆడపిల్లలను పై చదువులు చదివించడం ఇష్టం లేకపోయినా కూతురి కోరికను కాదనలేకపోయాడు. ఇరుగుపొరుగు మాటలను పట్టించుకోకుండా చదువుకు కావల్సిన డబ్బును సమకూర్చాడు. అప్పటి నుంచి ఉన్నత చదువులు చదువుకొని, 2016లో మియామిలోని ైఫ్లెయింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ పూర్తి చేసింది. తరువాత ఢిల్లీలోని వాణిజ్య పైలెట్ లైసెన్స్ పొందడానికి ప్రత్యేక శిక్షణ తీసుకున్నది. చివరికి కశ్మీర్‌లో పైలెట్‌గా ఉద్యోగం సంపాదించి తన కోరికను నెరవేర్చుకున్నది హబీబ్. ఇలా కశ్మీర్‌లో పైలెట్ అయిన తొలి ముస్లిం మహిళగా హబీబ్ చరిత్ర సృష్టించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి, ముస్లిం యువతులకు ఆదర్శంగా నిలిచింది.