టెడ్డీబేర్ చెబుతున్న కొత్త పాఠం

ఉద్యోగం చేస్తే.. ఆ చేసే ఒక్కరే సంపాదించొచ్చు. అదే వ్యాపారం చేస్తే.. తనతోపాటు చాలామందికి ఉపాధి కల్పించొచ్చు. అంతేకాదు.. తనకంటూ ఉన్న అభిరుచిని, సృజనాత్మకతను సాకారం చేసుకోవచ్చు. డీవీవీ శ్రీ లక్ష్మీవాణి ఈ బాటలోనే ప్రయాణిస్తున్నారు.టెడ్డీబేర్ వ్యాపార సామ్రాజ్యానికి రాణిగా మారి.. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. నేడు నేషనల్ టెడ్డీబేర్ డే సందర్భంగా సక్సెస్‌ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ శ్రీ లక్ష్మీవాణి పరిచయం మీకోసం.

శ్రీ లక్ష్మీ వాళ్లది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లున్న కుటుంబ నేపథ్యం. ఆమెను కూడా ఆ జాబితాలోనే చేర్చాలనుకున్నారు కుటుంబ సభ్యులు. పారిశ్రామిక వేత్తగా రాణించాలనేది ఆమె లక్ష్యం. తను ఏం కావాలనుకుంటున్నదో ఇంట్లోవాళ్లకు చెప్పేసింది. ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించించి ఆమె డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ ఇండియాకు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టిన శ్రీ లక్ష్మీ తండ్రి ఉద్యోగరీత్యా ఆమె వేర్వేరు ప్రాంతాల్లో చదవాల్సి వచ్చింది. పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే తాను దాచుకున్న డబ్బుతో ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా జూట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. వ్యాపారం ద్వారా సాటి మహిళా సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్లమవుతామనేది ఆమె ఆలోచన. ప్రపంచ దేశాలు విపరీతంగా ఆదరించే టెడ్డీబేర్‌ను వ్యాపార వనరుగా మార్చుకొని పరిశ్రమను స్థాపించారు.

లాభసాటి వ్యాపారం! : పరిశ్రమలపై పరిశోధన చేసి పీహెచ్‌డీ చేసిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారు శ్రీలక్ష్మీ వాణి. ఈ రంగంలో డాక్టరేట్ కూడా అందుకున్నారు. పారిశ్రామిక రంగంలోకి రావాలనే ఆసక్తే కాదు.. దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. దేశ విదేశాలు పర్యటించి పనితీరు, లాభ నష్టాలు, ఎగుమతి దిగుమతులు, మార్కెటింగ్ పట్ల స్పష్టమైన అవగాహన పొందారు. అలా మొదటిసారిగా 1989లో మిషనరీ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. 1990లో సుహాసినీ ఇండస్ట్రీస్ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో టెడ్డీబేర్ వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తున్నారు. మెక్సికో, ఇటలీ, జర్మనీ, న్యూయార్క్‌లకు ధీటుగా టెడ్డీబేర్‌లు ఉండేట్లు హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమను ఏర్పాటుచేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. భువనగిరి యాదాద్రి జిల్లా మల్కాపూర్, నాంపల్లి, విజయనగరం జిల్లాలోనూ, విశాఖ పట్టణం, నోయిడాలలో పరిశ్రమలను స్థాపించి మహిళలకు కుట్లు అల్లికలు, ఇతర చేతి వృత్తులపై శిక్షణ ఇస్తూ ఉద్యోగార్థులకు ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీసాయి లక్ష్మీ దుర్గా భారతి సూర్య పవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వెంకటశ్రీ సాయి ఇండస్ట్రీస్ ద్వారా 25కోట్ల టర్నోవర్‌కు చేరుకొని లాభసాటి వ్యాపారం చేస్తున్నారు.

సేవా కార్యక్రమాలు: శ్రీలక్ష్మీ వాణి పరిశ్రమలను స్థాపించి మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించడమే కాకుండా సామాజిక, ఆధ్యాత్మికంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. నిరుపేద మహిళలు ఆర్థిక ప్రగతిని సాధించేందుకు సహాయం చేస్తున్నారు. పేద యువతుల పెండ్లికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లోని మహిళలకు పలు చేతి వృత్తుల్లో శిక్షణనిస్తూ సబ్సిడీ రుణాలు అందజేస్తున్నారు.

అరుదైన ఘనత: ప్రపంచంలోనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించి డాక్టరేట్ అందుకున్న పారిశ్రామికవేత్తగా అరుదైన ఘనత సాధించారు. ఇతర దేశాలకు పోటీగా మన దేశంలో మహిళలను ప్రోత్సహించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఫర్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ డెవలప్‌మెంట్ ఇండియాను ప్రారంభించి పలు సేవలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఇతర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచీ ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నది అని ఆమె చెప్పారు.

విదేశాలకు ఎగుమతి!

హైదరాబాద్, మల్కాపూర్, నోయిడాలలో తయారైన టెడ్డీ బేర్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మెక్సికో, దుబాయ్ వంటి దేశాల నుంచి ముడి సరుకును తీసుకువచ్చి కోట్ల రూపాయల ఆర్డర్లు స్వీకరిస్తూ వారికి అందిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో పాటు వినూత్నంగా ఆకట్టుకునేలా ఉండడంతో వారు వీటిని ఎక్కువగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలక్ష్మీ దగ్గర 1500 మంది మహిళలు టెడ్డీబేర్స్ తయారుచేస్తూ ఆర్థిక అభయం పొందుతున్నారు. పసుపులేటి వెంకటేశ్వరరావు