జార్ఖండ్ మహిళల సహాయం..

కేరళ వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. లక్షలాది మంది జనం నానా ఇబ్బందులు పడడమే కాకుండా, రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది. బాధితులకు సాయమందించేందుకు దేశ, విదేశాలు సైతం ముందుకు వచ్చాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహిళలు జిల్లా పరిపాలనా అధికారుల సహకారంతో వరద బాధితులను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారు.

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా బలిజోర్ గ్రామానికి చెందిన మూడొందల మంది మహిళలు కేరళ బాధితులను ఆదుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. అందరూ రాత్రి, పగలు కష్టపడి వెయ్యి జతల చెప్పులను స్వయంగా తయారు చేసి ఆగస్టు 27న వారికి అందజేశారు. స్వయంగా తాము సంపాదించిన సొమ్ములో నుంచి వరద బాధితులకు డబ్బు రూపంలో ఇవ్వలేకపోయినా వారికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతో చెప్పుల తయారీ పరిశ్రమలో పని చేస్తున్న మహిళలంతా కలిసి వెయ్యి జతల చెప్పులను వితరణగా ఇచ్చారు. ఉపాధి అవకాశాలు లేక రోడ్డు పక్కన వస్తువులు అమ్ముతూ ఎన్నో విధాలుగా వేధింపులకు, అవమానాలకు గురైన మిత్య,మంజు వంటి అమ్మాయిలు ఈ మంచి పనికి తోడందించారు. ఒక్కొక్క జత తయారీ కోసం రూ.70 వరకూ అవుతుంది. 70వేల రూపాయల చెప్పులతోపాటు ప్రతి ఒక్కరూ తమ ఒక్క రోజు వేతనం రూ.250లు వరద బాధితులకు వితరణగా అందించారు.

ఒక్కరోజు వేతనాన్ని వారికి అందజేయడం వల్ల ఎంతో మందికి సాయం చేసిన వాళ్లమవుతామనే ఉద్దేశ్యంతోనే అందరం ముందుకు వచ్చామని మోనికా అనే మహిళ తెలిపింది. కేరళ బాధితుల కోసం అందించే సరుకును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తరలించేందుకు సిద్ధం చేశారు. దుమ్కా డిప్యూటి డెవలప్‌మెంట్ కమిషనర్ వరుణ్ రంజన్ ఈ వాహనాన్ని ఆగస్టు27న జెండా ఊపి ప్రారంభించారు. వారికి సాయమందించిన ఘనత బలిజోర్ గ్రామస్తులకే దక్కుతుందని, వరద బాధితులను ఆదుకునేందుకు ఈ మహిళలనే స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకురావాలని రంజన్ పిలుపునిచ్చారు. ఆ తర్వాత బలిజోర్ గ్రామ మహిళలను చూసి సామాజిక సంస్థలు, కాలేజ్ స్టూడెంట్స్, వివిధ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులు, ఇతర వలంటీర్లు ఆ జిల్లా కలెక్టరేట్ సిబ్బంది అందరూ కలిసి వరద బాధితులకు తమ వంతు సాయాన్ని అందించారు.