చెర్రీ టమాటాకు మంచి డిమాండ్

Tamata చెర్రీ టమాటా అంటే మీకు తెలుసా..? అదే మనం రామ ములక పండ్లు(చిన్న టమాటా). ఇవి మన దగ్గర పండించడం అరుదు. కానీ ప్రస్తుతం వీటికి మార్కెట్‌లో మంచి డిమాండు ఉన్నది. మార్కెట్‌లో ధర కూడా బాగానే పలుకుతున్నది. వీటిని ప్రత్యేక సాగుగా చేసేందుకు జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని ఉద్యాన వన శాఖ పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు పొందింది. క్యారీ బ్యాగుల్లో పండించి పంటలోనే అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఈ సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అధికారుల సలహాలు సూచనలు తీసుకుని చేబడితే మంచిది.

పోషకాలు

చెర్రీ టమాటాలో విటమిన్ ఏ,సీ పోషకాలు పుష్కలం. కొవ్వు శాతం తక్కువ. అందువల్ల రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ సీ విటమిన్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ మోతాదులో సోడియం ఉండి రక్తపోటు తగ్గిస్తుంది. మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, లవణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి.

సలాడ్స్‌తో ఉపయోగం..

చెర్రీ టమాటాను ఎక్కువగా సలాడ్స్, రోస్టింగ్ చేసి అల్పాహారం లో తీసుకుంటారు. పిజ్జా తయారీలో తప్పనిసరిగా వాడుతారు. తక్కువ సైజులో పరిమాణంలో ఉండటం వల్ల నేరుగా తినడానికి అనుకూలం. ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా ఈ పంట సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. పాలీహౌజ్, పందిర్ల కింద సాగు చేస్తే అధిక దిగుబడి దిగుబడి సాధించవచ్చు.

నారు మడుల యాజమాన్యం..

- మార్కెట్‌లో దిగుబడినిచ్చే మంచి రకం విత్తనాలను ఎంచుకోవాలి. - ఒక మీటర్ వెడల్పు, ఎనిమిది ఇంచుల ఎత్తులో బెడ్లు తయారు చేసుకోవాలి. - కింద 1మీటర్ మందము, పైన 80 సెంటీ మీటర్ల మందం బెడ్ ఉండేలా చూసుకోవాలి. - ప్రతి చదరపు మీటర్‌కు ఒక గంప పశువుల ఎరువు, 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 50 గ్రాముల డీఏపీ, 25 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి కలుపాలి. తర్వాత బెడ్ మీద రెండు వరుసలలో మొక్కలు నాటాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, వరుసల్లోని మొక్కల మధ్య 30 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. - విత్తనాలు నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల మధ్యన మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. - ప్రధాన బెడ్‌లు లేదా మడులలో మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత వచ్చే మొదటి పూత వస్తుంది. - నాటిన 15 రోజుల తర్వాత రెండు దిక్కుల ఊత(సపోర్ట్) కర్రలు పాతాలి. నాటిన 20 రోజుల్లో మొక్క 1 అడుగు పెరిగిన తర్వాత చివరి మొగ్గను తుంచి వేయాలి. - మొక్కలు వంగిపోకుండా ఊత కర్రల మీద 12 గేజ్‌ల సామర్థ్యం కలిగిన వైర్‌ను ఆ చివరి నుంచి ఈ చివరికి కట్టాలి. - కింది నుంచి రెండు కొమ్మలు వస్తాయి. వీటిలో అధికంగా ఉంటే రెండు కొమ్మలు వదిలి మిగతావి తుంచి వేయాలి. కొమ్మలు తొమ్మిది ఇంచులు పెరిగిన తర్వాత కొమ్మలకున్న చిగుర్లు తెంచి వేయాలి. ఆ తర్వాత కొమ్మ చివరి నుంచి ఉప కొమ్మలు 15 రోజుల్లో వస్తాయి. నాటిన మొక్కలు 8 ఫీట్ల వరకు పెరిగిన తర్వాత కాపునకు వస్తాయి. - ఒక్కో మొక్క 8 నుంచి 10 కిలోల కాయ దిగుబడినిస్తుంది. ఈ లెక్కన 8 వేల మొక్కలు నాటితే సుమారు 64 టన్నులదిగుబడి వస్తుంది.

ప్రత్యేక ఎరువులు

- నీటిలో కరిగే ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు 19-19-19, 13-0-45, కాల్షియం, నైట్రేట్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌లను వారానికి రెండు సార్లు పిచికారీ చేయాలి. - సాధ్యమైనంత వరకు డ్రిప్‌ల ద్వారా ఎరువులు అందించాలి. సాధ్యంకాకుంటే ఎరువులుగా ఒక బస్తా డీఏపీ, అర బస్తా పొటాష్‌లను 30 రోజులకు, 45 రోజులకు 90 రోజులకు మూడు దఫాలుగా వేయాలి.

చీడలపీడల నియంత్రణ- తామర పురుగులతో ఇబ్బందులకు గురయ్యే మొక్కల నియంత్రణకు ఒక లీటర్ నీటిలో డైఫెంథోరియాన్/రీజెంట్ 2 మి.లీటర్లతో పిచికారీ చేయాలి. - నల్లి నివారణకు ఒక లీటర్ నీటిలో 1 మిల్లీ లీటర్ ఓ మైట్ మందును పిచికారీ చేయాలి. - తెల్లదోమ నివారణకు పెగాసస్ ఒక మిల్లీ లీటర్ మందును లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. - ఆకు మచ్చ తెగలు నివారణకు ఒక లీటర్ నీటిలో 2 గ్రాముల డైథేన్‌ఎం-45 కలిపి పిచికారీ చేయాలి. - ఆకు మాడు తెగులు నివారణకు ఒక లీటర్ నీటిలో 2 మిల్లీ లీటర్ల రిడోమిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - బూడిద రోగం నివారణకు ఒక లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల కెరాథేన్ అనే మందుతో పిచికారీ చేయాలి. -మల్లేశ్, పేట్‌బషీరాబాద్ 9666999541 Ahamad

శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం

జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చెర్రీ టమాటాపై పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనలలో ఫలితాలు బాగున్నాయి.. ఈ పంట సాగు చేయడం వల్ల రైతులకు లాభదాయకం. సాగు చేయాలనే ఆసక్తి ఉన్న క్రాప్ కాలనీల రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. -లైక్ అహ్మద్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏడీహెచ్

More in రైతుబ‌డి :