చిన్ననాటి కల నెరవేర్చుకున్నది!

అణగారిన వర్గాల్లో మార్పు తీసుకురావాలంటే ఐఏఎస్‌తోనే సాధ్యమని నమ్మింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా లక్ష్యం వైపే గురిపెట్టి.. సాధించింది.

తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన పూవితా సుబ్రహ్మణ్యానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది. పూవిత తండ్రి పాడిరైతు. ఒకరోజు స్కూల్‌లో జరిగే డ్రెస్సింగ్ పోటీలకు ఐఏఎస్ ఆఫీసర్‌గా తయారైంది. అప్పుడు పూవితను చూసిన తల్లిదండ్రులు ఆమెవి చిన్నపిల్లల చేష్టలనుకున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన పూవిత.. వరకట్నం, లింగవివక్ష, ఆడపిల్లలపై చిన్నచూపు వంటి వాటిని అసహ్యించుకునేది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇరయంబు.. కుల వర్గాల మధ్య మార్పు తీసుకురావాలంటే పౌరులు సివిల్స్ సాధించాలని సూచించారు. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న పూవిత.. ఐఏఎస్ అవ్వాలని దృఢంగా నిర్ణయించుకుంది. ప్లస్‌టూ అయిపోగానే కోయంబత్తూర్‌లోని కుమారగురు కాలేజ్‌లో టెక్స్‌టైల్ ఇంజనీర్‌గా చేరింది. చదువుతో పాటు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ.. ఆర్థిక సమస్యల కారణంగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది. పెళ్లిచేసుకోమని తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేసినా లక్ష్యంపైనే గురిపెట్టి ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకున్నది. మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ తప్పినా, 2015లో 175వ ర్యాంకర్‌గా నిలిచి తన కలను నెరవేర్చుకున్నది. ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నది. తర్వలో కర్ణాటక కేడర్‌లో సబ్ డివిజనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తించనున్నది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే, దానిని సాధించే వరకూ పట్టువిడువ కూడదని చెబుతున్న పూవిత ఎంతోమందికి ఆదర్శం.

Related Stories: