చాంపియన్ జానకి

భారతదేశంలో ఆడవాళ్లకు రక్షణ కరువైంది. అన్నీ బాగున్నవారి పరిస్థితితో పోలిస్తే దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే వారి యుద్ధం వారే చేసుకునేలా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది. దానిద్వారా జూడో నేర్చుకొని ప్రపంచ చాంపియన్ అయిందో అమ్మాయి.

భారతదేశ గణాంకాల ప్రకారం 2016లో 38,947 రేప్ కేసులు నమోదయ్యాయి. అందులో 4,882 కేసులు మధ్యప్రదేశ్ నుంచే ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే ఆడవాళ్లు బయట అడుగుపెట్టాలంటేనే భయమేస్తున్నది కదా! అదే చూపులేని వారు, దివ్యాంగుల గురించి ఆలోచిస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. సైట్‌సేవర్స్ అనే ఒక స్వచ్చంద సంస్థ మధ్యప్రదేశ్‌లో ఆడవాళ్లకు ముఖ్యంగా దివ్యాంగులకు జూడోలో శిక్షణ ఇప్పిస్తున్నది. అందులో జానకి అనే అమ్మాయి కూడా శిక్షణ తీసుకున్నది. ఐదు సంవత్సరాల వయసులోనే చూపు కోల్పోయింది. ఆమె అసహనాన్ని గుర్తించిన చాలామంది దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమెలోని ధైర్యం ఆమెను కాపాడింది. 2010లో సైట్‌సేవర్స్ పరిచయం ద్వారా ఆమె జీవితమే పూర్తిగా మారిపోయింది. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుందామని ఈ గ్రూప్‌లో జాయినయింది. అలా ఆమెకు జూడో పరిచయమైంది. 2017లో నేషనల్ చాంపియన్‌గా ఎదిగింది. ఇప్పుడు మరికొంతమంది దివ్యాంగులకు జూడోలో శిక్షణ కూడా ఇస్తున్నది.