గణమైన కోర్సు

స్టాటిస్టిక్స్
సర్వేలు, బడ్జెట్‌లు, ప్రయోగాలు తదితరాలను గణాంకాల రూపంలో ప్రజలకు అర్థవంతంగా వివరించడమనేది చాలా కష్టమైన ప్రక్రియ. డాటా సేకరణ, ప్రణాళిక రచనతో సహా డాటా అంశాలను సూచించడంలో కీలకపాత్ర గణాంక నిపుణులదే. కొంతకాలంగా చిన్నచిన్న వ్యాపార సంస్థలు కూడా గణాంక నిపుణులను నియమించుకుంటున్నాయి. దేశంలో పన్ను చెల్లింపుదారులు వేగంగా పెరుగుతుండటం కూడా గణాంక నిపుణులకు డిమాండ్ పెంచుతున్నది. అందువల్ల కెరీర్‌పరంగా ఉన్నతంగా ఎదిగేందుకు స్టాటిస్టిక్స్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయం. స్టాటిస్టిక్స్ చదవాలనుకునేవారి కోసం ఈ వ్యాసం ప్రత్యేకం...
-స్టాటిస్టిక్స్ లేదా గణాంక శాస్త్రం అంటే ఒక విషయం గురించిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి, డాటా రూపంలో ప్రదర్శించడం. ఇది గణిత శాస్త్రంలో భాగం. శాస్త్రీయ, పారిశ్రామిక లేదా సాంఘిక సమస్యలకు గణాంకాలను వర్తింపజేసి, జనాభాతో గణాంక నమూనా ప్రక్రియను అధ్యయనం చేయడమే గణాంకశాస్త్రం. దీనిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి సోషల్, ఎకనామిక్స్‌లో సమస్యలకు గణాంక, గణిత శాస్ర్తాన్ని వర్తింపజేసే నేర్పు, తెలివి ఉండాలి. -పరిశ్రమల్లో వివిధ రంగాల్లోని విషయాలను గణాంకాల్లో సేకరించి, డిజైన్ చేసి, విశ్లేషించే వారినే స్టాటిస్టీషియన్స్ (గణాంక నిపుణులు)గా పిలుస్తారు. మార్కెటింగ్, ఎకనామిక్స్, బయాలజీ, పబ్లిక్ హెల్త్, స్పోర్ట్స్, మెడిసిన్స్, సైకాలజీ, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాల్లో ఈ గణాంక నిపుణుల అవసరం చాలా ఉంది. అంతేగాక ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, లేబర్ యూనియన్లు, రాజకీయ నాయకులకు, సోషల్ వర్కర్స్, ట్రేడ్ అసోసియేషన్స్, వివిధ చాంబర్లలో కూడా వీరికి బాగా డిమాండ్ ఉంది.

కోర్సులు

సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు

-సర్టిఫికెట్ ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ -డిప్లొమా కోర్స్ ఇన్ స్టాటిస్టిక్స్

డిగ్రీ కోర్సులు

-బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్టాటిస్టిక్స్ -బ్యాచిలర్ ఇన్ స్టాటిస్టిక్స్ -బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) ఇన్ స్టాటిస్టిక్స్ -బీఎస్సీ (ఎంఎస్‌సీఎస్)

పీజీ కోర్సులు

-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్టాటిస్టిక్స్ -మాస్టర్ ఇన్ స్టాటిస్టిక్స్ -మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) ఇన్ స్టాటిస్టిక్స్

డాక్టోరల్ కోర్సులు

-మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ స్టాటిస్టిక్స్ -పీహెచ్‌డీ ఇన్ స్టాటిస్టిక్స్ -అర్హత: స్టాటిస్టికల్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌ను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. పీజీ చేయాలనుకునేవారు డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా చదవాలి. డాక్టోరల్ కోర్సులు చేయాలనుకునేవారు ఎం.స్టాట్, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి.

విద్యాసంస్థలు

-స్టాటిస్టికల్ కోర్సును దేశంలో ప్రధానంగా అందిస్తున్న సంస్థల్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) ఒకటి. ఇది ఐఎస్‌ఐ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నది. దీని శాఖలు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో ఉన్నాయి. ఇతర కాలేజీలు కూడా సొంత ఎంట్రన్స్‌ల ద్వారా అడ్మిషన్లు ఇస్తున్నాయి. -అలీగర్ ముస్లిం యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నది. -ఢిల్లీ యూనివర్సిటీ -యూనివర్సిటీ ఆఫ్ పుణె -కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ -గ్జేవియర్ కాలేజీ, అహ్మదాబాద్ -దేవి అహల్యా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇండోర్ -సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, న్యూఢిల్లీ -సెయింట్ గ్జేవియర్ కాలేజీ, ముంబై -సెయింట్ గ్జేవియర్ కాలేజీ, కోల్‌కతా -హన్సరాజ్ కాలేజీ, న్యూఢిల్లీ -హిందూ కాలేజీ, న్యూఢిల్లీ -లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్, న్యూఢిల్లీ -ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ధన్‌బాద్ (జార్ఖండ్) -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, ఉత్తరప్రదేశ్) -లయోల కాలేజీ, చెన్నై -ప్రెసిడెన్సీ కాలేజీ, చెన్నై -కమలా నెహ్రూ కాలేజీ ఫర్ ఉమెన్, న్యూఢిల్లీ -ఫెర్గూసన్ కాలేజీ, పుణె (మహారాష్ట్ర) నోట్: అడ్మిషన్లు తదితర వివరాల కోసం ఆయా కాలేజీల వెబ్‌సైట్లను దర్శించాలి.

ఏపీలోని సంస్థలు

-ఆంధ్రా యూనివర్సిటీ బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నది. -ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్), ఎమ్మెస్సీ (అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్) కోర్సులను అందిస్తున్నది. -సీఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజీ (కడప) బీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. -ద్రవిడియన్ యూనివర్సిటీ (చిత్తూరు).. బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను అందిస్తుంది. -శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ (చిత్తూరు).. బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. -శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (అనంతపూర్).. బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఫిల్ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను అందిస్తుంది.

నైపుణ్యాలు

-మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో బలమైన పునాది ఉండాలి. -లాజికల్ థింకింగ్, ఎబిలిటీ, కీ ఫ్యాక్ట్స్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. -సమస్యలను అర్థం చేసుకోవడానికి వివిధ రంగాల్లోని వ్యక్తులతో ఇంటరాక్టయ్యే సామర్థ్యం ఉండాలి. -స్టాటిస్టికల్ కంప్యూటింగ్‌లో నేర్పు ఉండాలి. -ఎప్పటికప్పుడు స్టాటిస్టికల్ లిటరేచర్‌లో, సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ అవుతుండాలి. -సానుకూలంగా సమస్యలను పరిష్కరించే నేర్పు ఉండాలి.

గణాంక నిపుణుల విధులు

-సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం -సర్వేకు అవసరమైన డాటాను సేకరించి, ప్రయోగ ప్రక్రియను రూపకల్పన చేయడం -బిజినెస్, సైన్స్, ఎలక్షన్ వంటి ఇతర రంగాల్లో ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికి గణాంక పద్ధతులను అమలు చేయడం -సేకరించిన సమాచార విశ్లేషణ, నివేదికలపై వ్యాసాలు రాయడం -సర్వే వంటి ఇతర రంగాల ఫలితాలను సంబంధిత సంస్థలు, వ్యక్తులకు వివరించడం

తెలంగాణలోని సంస్థలు

-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆపరేషన్ రిసెర్చ్ కోర్సును అందిస్తున్నది. -ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సు అందుబాటులో ఉంది. -కాకతీయ యూనివర్సిటీ బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను అందిస్తున్నది. -బద్రుకా కాలేజీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (కాచిగూడ).. బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. -సాయి సుధీర్ డిగ్రీ కాలేజీ (ఈసీఐఎల్ క్రాస్‌రోడ్)లో ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సు అందుబాటులో ఉంది. -రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీలు బీఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును అందిస్తున్నాయి. ఫీజులు ఆయా కాలేజీలను బట్టి ఉన్నాయి.

కెరీర్ అండ్ జాబ్స్

-స్టాటిస్టీషియన్స్, బిజినెస్ అనలిస్ట్, మ్యాథమెటీషియన్, ప్రొఫెసర్, రిస్క్ అనలిస్ట్, డాటా అనలిస్ట్, కంటెంట్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ట్రెయినర్, డాటా సైంటిస్ట్, కన్సల్టెంట్, బయోస్టాటిస్టీషియన్, ఎకనామెట్రీషియన్ వంటి వివిధ హోదాల్లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. -సెన్సస్, ఎకలాజికల్, మెడికల్, ఎలక్షన్, నేర, విద్య, సినిమా, క్రికెట్, ఇతర క్రీడలు, టూరిజం, యానిమల్ పాపులేషన్, ఆటోమొబైల్ వంటి సంస్థలకు గణాంక నిపుణుల అవసరం చాలా ఉంది. -ఈ కోర్సు చేసినవారికి రాష్ట్ర, దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. స్టాటిస్టికల్ నైపుణ్యాలున్నవారికి ప్రస్తుత ప్రపంచ విపణిలో భారీ డిమాండ్ ఉంది. -వ్యాపారం, పరిశ్రమ, వ్యవసాయం, ప్రభుత్వం, ప్రైవేట్, కంప్యూటర్ సైన్స్, సైంటిఫిక్, హెల్త్ సైన్స్ వంటి వివిధ రంగాల్లో కూడా స్టాటిస్టికల్‌ను ఉపయోగించవచ్చు. -స్టాటిస్టికల్ విద్యను పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వంటి పరీక్షలు రాయవచ్చు. -స్టాటిస్టికల్ డిగ్రీ పూర్తిచేసినవారు ఫైనాన్స్, విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, అక్చూరియల్ సైన్స్ వంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.

రిక్రూట్ చేసే కొన్ని సంస్థలు

-డెలాయిట్ కన్సల్టింగ్ -టీసీఎస్ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ -బ్లూ ఓషియన్ మార్కెటింగ్ -బీఎన్‌పీ పారిబాస్ ఇండియా -నీల్సన్ కంపెనీ -యాక్సెంచర్ -హెచ్‌పీ -జీఈ క్యాపిటల్ -హెచ్‌డీఎఫ్‌సీ -కాగ్నిజెంట్ -అమెరికన్ ఎక్స్‌ప్రెస్ -ఆర్బీఐ -హెచ్‌ఎస్‌బీసీ -ఇండియన్ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో -జెన్‌ప్యాక్ట్

వేతనాలు

-స్టాటిస్టికల్ విద్యను పూర్తిచేసినవారికి దేశీయంగా అయితే ఏడాదికి రూ. 2.5 లక్షల ప్రారంభ వేతనం లభిస్తుంది. ఆ తర్వాత పనితనాన్ని బట్టి రూ.5 లక్షల వరకు వేతనం లభిస్తుంది. -విదేశాల్లో అయితే ఏడాదికి 70 వేల డాలర్ల వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది. -చాపల సత్యం