గడప గడపకూ ప్రచారం

సరైన అవగాహన లేక ఎంతో మంది క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. ఓ యువతి క్యాన్సర్‌పై సమరాన్ని ప్రకటించి, పోరాడేందుకు సంకల్పించింది. అందరికీ క్యాన్సర్ గురించి అర్థమయ్యే విధంగా వివరించేందుకు గడపగడపకూ వెళ్ళి చైతన్యవంతుల్ని చేయడానికి సిద్ధమైంది. మొగ్గలోనే ఆ మహమ్మారిని తుంచి వేసేందుకు నడుం బిగించింది.

భారతదేశంలో ఆలస్యంగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ముందుగా పసిగడితే క్యాన్సర్‌ను తగ్గించవచ్చనే ఉద్దేశ్యంతో ఆమె ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తూ ప్రచారాన్ని చేపట్టింది. 24 యేండ్ల డా.ప్రియాంజలి దత్త అందరి ఆరోగ్య సంరక్షణ కోసంఆరూగ్య అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఒకవేళ ఆ రోగం వచ్చిన తర్వాత చికిత్స చేసినా పదిలో ఎనిమిది మంది మహిళలు ఐదేళ్ళ కంటే ఎక్కువ కాలం బతకడం లేదు. అన్ని పరిస్థితులను పరిశీలించిన ఆమె జనాలను చైతన్యవంతుల్ని చేసేందుకు ఆరూగ్య అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఊరూరు తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, ఈశాన్య రాష్ట్రాలలో ఐదు లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించ గలిగింది.

కాలేజీలో చదువుకునే రోజుల్లో ఫ్యాషన్ షోలు నిర్వహించి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు అవగాహనా శిబిరాలను సైతం నడిపేది. ఆమెతో పాటు కొందరు మిత్రులు కలిసి ఎక్కువ మందికి సేవ చేయాలనే దృక్పథంతో 2017లో ఆరూగ్య సంస్థను ప్రారంభించినట్టు చెబుతున్నది. ఈశాన్య రాష్ట్రాలలోనూ, మేఘాలయలోనూ పచ్చి వక్క నమలడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రియాంజలి దత్త చెబుతున్నది. ప్రజల అనారోగ్య సమస్యలను గురించి తెలుసుకుందామని ఆరూగ్య బృందం పలు గ్రామాలకు వెళ్తే అక్కడి ప్రజలు భయపడి దూరంగా వెళ్ళేవారు. అయినా వెళ్లి వాళ్ళకు క్యాన్సర్ వ్యాధి వల్ల కలిగే నష్టాలను వివరించి పలురకాల జాగ్రత్తలు చెప్పేవారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే వారికి వైద్య సేవలు అందిస్తూ క్యాన్సర్ పై యుద్దం చేస్తూ, చైతన్యవంతులుగా తీర్చి దిద్దుతున్నారు.