హృద్యమైన ప్రేమకథ

అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. రిద్ధికుమార్, రాధాబంగారు కథానాయికలు. కె.ఎల్.ఎన్.రాజు నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో గోపీచంద్ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత పరిశ్రమలో అందరికి కావాల్సిన వ్యక్తి. ట్రైలర్ చాలా బాగుంది. హీరో అశ్విన్ యాక్షన్ ఘట్టాలలో, డైలాగ్స్ పలకడంలో మంచి ప్రతిభను ప్రదర్శించాడు. ప్రతి సన్నివేశంలో చక్కటి పరిణితితో నటించాడు అన్నారు. హైదరాబాద్, అరకు, విశాఖపట్నం, మలేషియాలో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని నిర్మాత తెలిపారు. హృద్యమైన భావాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని మధురభావనలకు అద్ద పడుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని దర్శకుడు తెలిపారు. కాశీవిశ్వనాథ్, అనీష్ కురువిళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజు, సంగీతం: కె.సి.అంజన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.