కొత్త జీవావరణం

అంటార్కిటికా హిమఖండం నుంచి వేరుపడుతున్న ఒక భారీ మంచుకొండ వల్ల అతిప్రాచీనమైన కొత్త జీవావరణ వ్యవస్థ బయటపడనున్నది. అది ఎంత పురాతనమైందో అంత కొత్తది అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అమెరికాలోని డెలావేర్ రాష్ట్రమంత వైశాల్యంతో కూడిన భారీ హిమశిఖరం (Huge Iceberg) కిందటేడాది (2017) జులైలోనే అంటార్కిటికా (లార్సెన్ సి ఐస్ షెల్ఫ్) నుంచి వేరుపడుతూ, అనూహ్యరీతిలో 90 డిగ్రీల అపసవ్య దిశలో కదులుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎ68గా పిలిచే ఈ పెద్ద మంచుకొండ వచ్చే ఏడాదికల్లా తానున్న ప్రదేశాన్ని ఖాళీ చేస్తుందని సముద్రవిజ్ఞాన, హిమనీనద శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన మీదట అక్కడ బయట పడనున్న కొత్త పర్యావరణ (జీవావరణ) వ్యవస్థ కనీసం 1,20,000 సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్నట్టు వారు తెలిపారు. ఐతే, ఖాళీ కానున్న ఆ కొత్త ప్రదేశంలో రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు చేపలు పట్టడం వంటి కార్యక్రమాలేవీ చేయరాదని 2016లోనే అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. కాబట్టి, కొత్త జీవావరణంపై అధ్యయనాలకు అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అప్పుడు ఎలాంటి అద్భుతాలు వెలుగు చూస్తాయో అన్న ఆసక్తి వారిలో కనబడుతున్నది.