కృష్ణతత్వమే మార్గదర్శం

పరమాత్మ పుట్టిన రోజు జీవులందరికీ మహాపండుగ రోజు!
విశ్వపాలకుడు శ్రీ కృష్ణ పరమాత్మకు మరణం ఎక్కడిది? లేదు కనుక, ఆయన జన్మించిన రోజును జయంతి అని ఎలా అనగలం? ఒక అవతారం ముగించినా ఆయన మూలరూపం చిరస్థాయిగా ఉండేదే. శ్రావణ బహుళ అష్టమి (2-3 తేదీలు) ఆ పరమాత్మ పుట్టిన రోజు. మరణం లేని మహాశక్తి స్వరూపం ఆ దేవదేవునిది. ఈ సందర్భంగా మానవాళికి ఆ అవతారమూర్తి అందించిన దివ్య సందేశంపైనే ఈ ప్రత్యేక వ్యాసం.
హైందవ పురాణ పురుషుల్లో శ్రీ కృష్ణుడంతటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనకు ఆయనే సాటి. యావత్ సృష్టి చరిత్ర మొత్తంలోనే ఇంత గొప్ప పరిపాలకుడూ మరొకరు లేరు. ఆయన స్వయంగా రాజు కాకపోవచ్చు, కానీ, రాజులకే రారాజు. అంటే, విశ్వపాలకుడు. యుగమేదైనా, ఇప్పటికీ ప్రజాపాలకులనబడే వారందరికీ ఆయన ప్రబోధించిన ధర్మ మార్గమే శిరోధార్యం. అదే దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ. మేధోజీవి అయిన ప్రతి ఆధునిక మానవ మాత్రునికీ ఇదే శరణ్యం.

చెడ్డవారిని శిక్షించడం, మంచివారిని రక్షించడం అనే ఉత్కృష్టమైన, విశ్వజనీనమైన ధార్మిక సూత్రాన్ని భగవంతుడు శ్రీకృష్ణుని రూపంలో మనకందించాడు. దానిని ఆయన తాను స్వయంగా ఆచరించాకే, కుల మతాలకు అతీతంగా ప్రపంచం మొత్తానికి ఒక సన్మార్గంగా ప్రబోధించాడు. అదే మనకు ఆచరణీయం, అనుసరణీయం, మార్గదర్శం కూడా. ఈ పర్వదినం (శ్రీకృష్ణ జన్మాష్టమి) వేళనైనా ఆ పరమాత్మ పరమోన్నత సందేశాన్ని అందుకోవడానికి అందరం సమాయత్తమవుదాం. కాలం లేదా సృష్టి ప్రారంభంలో కృత (సత్య)యుగం నాటికే దుష్ట, దుర్మార్గ లక్షణాలు పొడసూపడమే కాదు, పెచ్చు మీరినట్టు హైందవ పౌరాణిక విజ్ఞానం ప్రత్యేకించి దశావతారాల వృత్తాంతాలు చెబుతున్నాయి. ఆనాడు రాక్షస కృత్యాలు ఉన్నప్పటికినీ ధర్మం నాలుగు పాదాల నడిచింది.

కానీ, విష్ణువు తొలి అవతారం దాల్చే అవసరమూ అప్పుడే ఏర్పడింది. తొలి మత్స్యావతారంలో దుష్టశక్తులు (రాక్షసులు) అపహరించుకు పోయిన వేదాలను రక్షించడం నుంచి మొదలైన దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ బృహత్ కర్తవ్యం తదనంతర అవతారాలలోనూ కొనసాగి, శ్రీ కృష్ణుని వరకు వచ్చేసరికి ఆ కర్తవ్య నిర్వహణ తారస్థాయికి చేరింది. దాయాదులు, బంధుమిత్రుల నడుమ దుర్మార్గాలు హద్దుమీరి పోయిన ఫలితంగా ధర్మసంస్థాపన ఒక యజ్ఞంలా సాగింది. ఫలితంగా ఆవిర్భవించిందే కృష్ణతత్వం. అదే ద్వాపర యుగం తర్వాతి నుంచి ప్రారంభమైన (ప్రస్తుత) కలియుగానికి దివ్యరక్ష.

హైందవ మత విశ్వాసాల మేరకు నిజానికి దేవుడొక్కడే. మతం (ధర్మం) ఆయనే కేంద్రంగా సృష్టింపబడిన ఓ మహావ్యవస్థ. రాక్షసులంటే ఎవరో కాదు, దుష్టశక్తులు. వీటి నుండి మానవజాతిని రక్షించడానికే ఆ భగవంతుడు లేదా పరమాత్మ వేదాల సృష్టి నుంచి ధర్మసంస్థాపన వరకు ప్రతి ఒక్కటీ తనవైన అవతారాల ద్వారా నిర్వర్తించింది. దేవుని తొలి ఆదిస్వరూపంగా ఆదిపరాశక్తి వెలిస్తే, ప్రత్యక్ష ప్రథమ స్వరూపాలుగా త్రిమూర్తులను పేర్కొంటారు. సృష్టి, స్థితి, లయ కారులుగా బాధ్యతలు నిర్వహించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆ త్రిమూర్తులు. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తూ ఉంటే, విష్ణువు జీవకోటిని రక్షిస్తుంటాడు. ఈశ్వరుడు జీవుల కర్మానుసారం వాటిని అంతమొందిస్తుంటాడు. అందుకే, శివుడికి మహాకాలుడన్న పేరూ ఉంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదన్నది అందుకే! శివ సంహారమైనా, విష్ణువు దుష్టశిక్షణైనా లోక కళ్యాణాత్మకమేనన్నది ఇక్కడ అంత:సూత్రం.

శ్రీ కృష్ణుడు తానే పరమాత్మనని కురుక్షేత్ర సంగ్రామ వేళ అస్త్ర సన్యాసం చేసిన అర్జునునికి భగవద్గీతను ఉపదేశిస్తూ పేర్కొన్నాడు. అంతటితో ఆగక, ప్రత్యక్ష సాక్ష్యాధారంగా తన విశ్వరూపాన్నీ ప్రదర్శించాడు. శ్రీ మహావిష్ణువే శ్రీ కృష్ణుడని, కాబట్టి, కృష్ణతత్వమంటేనే పరమాత్మ తత్వమని వేరే చెప్పక్కర్లేదు. విష్ణువు దశావతారాల పరమార్థం కూడా ఇదే.

శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అయిదు అవతారాలు (మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన) ఒక్క కృత (సత్య)యుగంలోనే జరిగాయి. ఆరు- ఏడవ అవతారాలు త్రేతాయుగంలో, ఎనిమిది-తొమ్మిదో అవతారాలు ద్వాపర యుగంలో సంభవించాయి. పదవ అవతారం కల్కి పుట్టుక కలి యుగాంతానికి సంభవిస్తుందన్నది కథనం. అయితే, ద్వాపరంలోనే మానవజాతికి అవసరమైన అన్ని ధర్మ బోధనలూ శ్రీ కృష్ణుని రూపంలో భగవంతుడే అందించినట్టు వేదవిజ్ఞానులు చెప్తారు.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పురాణ కథలన్నీ ఒక ఎత్తయితే శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో సాగిన మహాభారతం ఐతిహాసమొక్కటీ మరో ఎత్తు. సమస్త ధర్మాలూ ఇందులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులోని ఉపకథలన్నీ ఒక్కో ధర్మనీతిని ప్రబోధించేదే. అవన్నీ ఒక ఎత్తయితే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ వేళ ఉద్భవించిన శ్రీకృష్ణుని భగవద్గీత మహాప్రవచనం ఒక్కటీ మరో ఉదాత్త దివ్యసందేశం. జన్మసార్థకతను కోరుకునే ప్రతి ఒక్కరూ మనదైన ఈ పౌరాణిక సాహిత్యంలోని తాత్వికతను అవగాహన పరచుకొనే ప్రయత్నం చేయాలి.

ఆయన జీవితమే ఒక మహా ప్రబోధం!

శ్రీకృష్ణుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ఆసాంతం ఆయన జీవితమంతా ఒక మహా ప్రబోధం. మేనమామ కంసుని నుంచి మొదలుకొని దుర్యోధనాదులను వధింపజేయడం వరకూ ఆయన సాగించిందంతా దుష్టశిక్షణ. అది కూడా శిష్టులైన పాండవుల కోసమే. శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన ఆ నల్లనయ్య లీలలు అద్భుతం, అనితర సాధ్యం. శ్రీ మహావిష్ణువు మొత్తం 22 లీలావతారాలు దాల్చినట్టు పురాణ కథలు చెప్తుండగా, వాటిలో పది ప్రముఖమైనవి. వీటిలో ప్రత్యేకించి శ్రీకృష్ణావతారం అత్యంత పరిపూర్ణమని వేదాంతులు చెప్తారు. కలియుగంలో ధర్మం పూర్తిగా వినాశనం కాకుండా ఎన్ని ప్రబోధాలు అవసరమో అన్నింటినీ ఈ దేవదేవుడు మనకు అందించాడు. విశ్వాసచిత్తంతో వాటిని అర్థం చేసుకోగలగడమే ఇక మనకు తరువాయి.