సంక్రాంతి బరిలో చరణ్

రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కైరా అద్వాని కథానాయిక. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. 2019 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే అత్యున్నత ప్రమాణాలతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. రామ్‌చరణ్ నుండి అభిమానులు ఆశించే అన్ని హంగులుంటాయి. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 10వ తేదీతో రెండు పాటలు మినహా టాకీపార్ట్ పూర్తవుతుంది. ఈ నెల 9 నుండి డబ్బింగ్ కార్యక్రమాల్ని ప్రారంభిస్తాం. త్వరలో చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలచేస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. కుటుంబ బంధాలకు వాణిజ్య హంగులను మిళితం చేసి దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ చిత్రానికి వినయవిధేయరామ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.