శుభవార్త సిద్ధం?

అగ్ర కథానాయిక అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని నెలలుగా దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ బెంగళూరు సోయగం ఈ ఏడాదే పెళ్లిపీటలెక్కబోతుందని కథనాలు వచ్చాయి. అయితే వీటిపై అనుష్క ఎప్పుడూ పెదవి విప్పలేదు. మీడియా సమావేశాల్లో కూడా పెళ్లి ప్రస్తావన వస్తే సున్నితంగా ప్రశ్నను దాటవేసేది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి పెళ్లి వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. తన పాదాన్ని చూపిస్తూ మట్టెలను పోలిన ఆకులను కాలి బొటనవేలు మధ్య ఉంచుకున్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోకు క్యాప్షన్ అవసరం లేదు అనే వ్యాఖ్యను జత చేసింది అనుష్క. కాలి మట్టెల ఆకృతిని చూపించడం పెళ్లికి చిహ్నమేనని పలువురు నెటిజన్లు ఆసక్తిగా కామెంట్స్ పెడుతున్నారు. కల్యాణ గంటలు మోగనున్నాయి..మీ పెళ్లి శుభవార్త కోసం మేమంతా ఎదరుచూస్తున్నాము అంటూ ఈ ఫొటోపై అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరేమో మిమ్మల్ని పెళ్లాడబోయే అదృష్టవంతుడెవరూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అభిమానుల వ్యాఖ్యలపై అనుష్క సమాధానమివ్వలేదు. ఏదిఏమైనా అనుష్క ఇన్‌స్టాగ్రామ్ తాజా చిత్రం హాట్‌టాపిక్‌గా మారింది. భాగమతి చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చిన అనుష్క తన తదుపరి సినిమాకు సంబంధించిన వివరాల్ని ఇంకా వెల్లడించలేదు.