కాన్పు కోసం.. సైకిల్ ప్రయాణం

మంత్రి అంటే ఓ కాన్వాయ్. గన్‌మెన్లు, బందోబస్తు. ఇవన్నీ మన దగ్గర. విదేశాల్లో మంత్రులు చాలా సింపుల్‌గా ఉంటారనడానికి ఇదో ఉదాహరణ. న్యూజిలాండ్ మహిళా మంత్రి కాన్పు కోసం సైకిల్‌పై దవాఖానకు వెళ్లారు.

గర్భంతో ఉన్నప్పుడు ఆరునెలల నుంచే బరువులెత్తకపోడం, నడువకపోవడం చేస్తుంటారు. ఇంట్లో అతి జాగ్రత్తలతో సాధారణ కాన్పులయ్యేవాళ్లకు కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కారణం ఆహారపు అలవాట్లు ఒక్కటే కావు. శారీరక శ్రమ కూడా ఒక కారణం. ఇప్పటికే గర్భిణులు బరువులు మోయడం, యోగా చేయడం, కరాటే పంచ్‌లు విసరడం వంటివి చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. న్యూజిలాండ్ ఆరోగ్య, రవాణా మంత్రి జూలీ అన్నె జెంటెర్ కాన్పు కోసం ఆసుపత్రికి సైకిల్‌పై వెళ్లారు. ఇదిప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆదివారం రోజు ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఆక్లాండ్ సిటీ ఆసుపత్రికి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ బయలుదేరారు. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతను కూడా ప్రోత్సహించాడు. గ్రీన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జూలీ చేసిన సైకిల్ ప్రయాణం గురించి ట్వీట్లు చేశారు.