డిండి ఎత్తిపోతల టెండర్లకు మార్గం సుగమం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీటిని అందించే డిండి ఎత్తిపోతల పథకం టెండర్లకు మార్గం సుగమమైంది. మూడురోజుల కిందట క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై సమీక్షించారు. నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ, సొరంగం పనుల డిజైన్లు, అంచనాలకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులో భాగమైన కిష్టరాంపల్లి రిజర్వాయర్ నిర్మాణ డిజైన్‌పై సీఎం పలు సూచనలు చేశారు. ప్రధానంగా ప్రతిపాదిత ప్రదేశానికి పక్కనే గుట్టలు ఉన్నందున ఆ వైపున రిజర్వాయర్ నిర్మాణం జరిగితే బండ్ నిర్మాణ వ్యయం తగ్గుతుందని చెప్పారు. ఈ మేరకు పరిశీలన చేయాల్సిందిగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌ను ఆదేశించారు. ఆ విభాగం చీఫ్ ఇంజినీర్ ఏ నరేందర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు మంగళవారం చింతపల్లి మండలంలోని కిష్టరాంపల్లి పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. సీఎం సూచనలకు అనుగుణంగా రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్‌ను ప్రాథమికంగా రూపొందించారు. కిష్టరాంపల్లి సామర్థ్యం గతంలో 6.78 టీఎంసీలుగా ఉంది. తాజా మార్పుతో సామర్థ్యం 1.2 టీఎంసీల మేర తగ్గనుందని అంచనా వేస్తున్నారు. గతంలో వ్యయం రూ.1200 కోట్ల వరకు ఉంటే.. ఇప్పుడు రూ.200-300 కోట్ల మేర తగ్గే అవకాశముంది. బుధవారం డిజైన్‌పై పూర్తి స్పష్టత రానుంది.

చనాక-కొరాట అనుమతులపై 12న సమావేశం:

కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఈ నెల 12న ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో చనాక-కొరాట బ్యారేజీ పర్యావరణ అనుమతుల అంశంపై చర్చించనున్నారు. లోయర్ పెనుగంగలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిర్మిస్తున్నది.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు