కళ తగ్గలేదింక!

తెలంగాణ పల్లెల్లో కళలకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.. తగ్గదు. తాత ముత్తాతల నుంచి వస్తున్న జానపద, సాంస్కృతిక సంపద మన సొంతం. నేటి డిజిటల్ యుగం ఆ కళలను కొంతవరకు ఛిద్రం చేసినా.. వాటి మీద మన ప్రేమ ఏ మాత్రం తగ్గదు. ఈ మాటను నిజమని నిరూపిస్తున్నది టీకనపల్లి గ్రామం. నలభయ్యేండ్లుగా వీధి భాగోతం, చిందు కళలు అక్కడ ఇప్పటికీ సజీవంగా కదలాడుతున్నాయి. చుట్టున్న పల్లెప్రజలు ఆ కళా వైభవాన్ని కండ్లారా చూసేందుకు తరలివస్తారు. ఆ కళావైభవం గురించి ప్రత్యేక కథనం ఈ వారం సింగిడిలో..

ఒకప్పుడు గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు వీధి భాగోతాలు, నాటకాలు, చిందు నృత్యాలు.. ఇలా ఎన్నో కళలు ప్రజలకు వినోదాన్ని పంచేవి. విజ్ఞానాన్ని కలగలిపి వినోదాన్ని రంగరించి ప్రజలకు అందించే ఆ కళా సంపద టీకనపల్లిలో ఇప్పటికీ తొణికిసలాడుతున్నది. పాండవ వనవాసం, రామాయణం, కిరాతార్జునీయం ఇలా ఎన్నో రకాలైన పాత్రలతో నటులు జనాలను అప్పట్లో మెప్పించేవారు. మధ్య మధ్యలో వచ్చే బుడ్డర్‌ఖాన్ ఇతర వేషాలతో నవ్వులు పూయించేవారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించేవారు. దీంతో ఆయా పాత్రలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి, వారి హృదయాల్లో నిలిచిపోయేవి. చదువు రాని వాళ్లు సైతం పద్యాలు, పాత్రకు సంబంధించిన విషయాలను అలవోకగా చెప్పేవారు. ఆశువుగా పాడేవారు. ఫలానా వ్యక్తి ఫలానా నాటకం, ఫలానా భాగోతం వేస్తున్నారంటే ఊరంతా ఖాళీ అయి వీధి భాగోతం ముందు ప్రత్యక్షమయ్యేది. అంతలా ఆకట్టుకునేవి ఆ కళారూపాలు. వీధి నాటకం, బుర్రకథ, హరికథ, భాగోతం, తోలు బొమ్మలాట ఇలా ఎన్నో కళలు టీకనపల్లి ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయి.

మీడియా ప్రభావం

టీవీలు వచ్చిన తర్వాత జానపద కళారూపాలు కొంత కుంచించుకుపోయాయి. నిర్లక్ష్యానికి గురైనాయి. హంగులతో కూడిన వినోద కార్యక్రమాలకు జనాలు ఆకర్షితులయ్యారు. కళనే జీవనోపాధిగా చేసుకొని బతికిన కుటుంబాలు దాదాపు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ.. మంచిర్యాల జిల్లాలోని టీకనపల్లి గ్రామస్తులు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు 40 ఏండ్ల పాటు కళను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాతలు, తండ్రుల వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పల్లె జానపద కళలను కాపాడుకోవడం కోసం ఊరంతా ఒక్కతాటి మీదకు వచ్చింది. నలభై ఏండ్ల కిందట కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణలీలలు వీధి భాగోతాలుగా ప్రదర్శించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంప్రదాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. గోపాలబాలలు పేరుతో ఉప్పరి రామస్వామి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది వీధి భాగోతాలు ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు.

ఆయన స్వతహాగా కళాకారుడు కావడం, జానపద కళల పట్ల ఆయనకున్న ప్రేమ ఈ కార్యక్రమానికి దోహదం చేసింది. ఎన్నో వీధి బాగోతాలు, యక్షగానాల్లో ఆయన పలు పాత్రలు పోషించి ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రతి ఏటా జానపద కళల ఉత్సవాలు చేస్తే ఊరు బాగుంటుందన్న నమ్మకం, ఆ కళల మీద వారికి ఉన్న ప్రేమతో నలభై ఏండ్లుగా ఈ గ్రామంలో ప్రతి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి, 24 గంటల పాటు నిర్విరామంగా భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రదర్శించే వీధినాటకం చూడడానికి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల ప్రజలు తరలివస్తారు. ఇతర గ్రామాల్లో, నగరాల్లో స్థిరపడిన వారు సైతం ఈ నాటక ప్రదర్శనల్లో పాల్గొనడానికి గ్రామానికి రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారిలో ఎక్కువగా సింగరేణి కార్మికులు ఉండటం గమనార్హం. ఉప్పరి రామస్వామి మనుమడు శరత్‌చంద్ర తన తాత మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసి, ముందుకు తీసుకెళ్తానంటున్నాడు.

కళ బాగుంటే.. ఊరు బాగుంటుంది..

నలభయేండ్ల క్రితం ఊరు బాగుండాలని దేవున్ని కొలుసూ,్త వీధినాటకాలు వేయడం ఒక అద్భుతం అయితే, ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఊరంతా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించడం ఆలోచింపజేసే అంశం. ఊరు బాగు కోసం ఆలోచించి ఊరంతా చల్లగా ఉండాలని ఉప్పరి రామస్వామి చేసిన ప్రయత్నం ఇప్పటికీ ఆ ఊరిలో ఐకమత్యాన్ని చాటుతున్నది. ఏ కార్యక్రమమైనా ఊరంతా మూకుమ్మడిగా చర్చించుకొని, ఒక్కమాట మీద ముందుంటారు. కళ.. కళ కోసం కాదు.. కళ ప్రజల కోసమనే మాటను నిజం చేస్తూ టీకనపల్లి గ్రామస్తులు కళను కాపాడుకునే తీరు తెలంగాణ గ్రామీణానికి, జానపద కళలను కాపాడుకునే బాధ్యతను గుర్తు చేస్తుంది. - కోల అరుణ్‌కుమార్ మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ