కరెంట్ అఫైర్స్

Telangana

ఎంజీఎన్‌ఈజీఎస్

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఈజీఎస్)లో తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ఎక్కువ మంది కూలీలకు పనికల్పించటంతోపాటు పనులను సమర్థవంతంగా నిర్వహించినందుకు వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ అవార్డులు లభించాయి. ఈ ఏడాది ఎంజీఎన్‌ఈసీఎస్ అవార్డులకు దేశవ్యాప్తంగా 18 జిల్లాలు ఎంపికయ్యాయి.

రామగుండం ఎన్టీపీసీ

విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రామగుండంలోని ఎన్టీపీసీకి ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అవార్డు 2018 లభించింది.

తెలంగాణ జోనల్ వ్యవస్థ

తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసిన జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన విభజనలో రాష్ర్టాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు.

టీటీడబ్ల్యూర్‌ఈఐఎస్

రాష్ట్రంలోని గురుకులాల నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూర్‌ఈఐఎస్)కి ఐఎస్‌ఓ 9001 సర్టిఫికెట్ లభించింది. ఆగస్టు 31న ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను టీటీడబ్ల్యూర్‌ఈఐఎస్ అదనపు కార్యదర్శి నవీన్ నికొలస్ అందుకున్నారు. ఈ సొసైటీ మరో ఘనతను కూడా సాధించింది. హైదరాబాద్‌లోని సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా పేపర్ రహితంగా రూపొందించి ఈ ఆఫీస్‌గా మార్చింది.

National

అటల్ ర్యాంకింగ్స్

దేశంలోని విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అటల్ ర్యాంకింగ్స్ (ఏఆర్‌ఐఐఏ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 30న ప్రారంభించింది.

పోస్ట్ పేమెంట్ బ్యాంకు

దేశంలో తొలిసారిగా తపాలాశాఖ బ్యాంకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించింది. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో సెప్టెంబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ పేమెంట్ బ్యాంకును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది పోస్టుమెన్ల ద్వారా ఈ పేమెంట్ బ్యాంకు సేవలను పొందవచ్చు. ఈ పేమెంట్ బ్యాంకుకు దేశంలోని 650 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక శాఖ ఉంటుంది. దేశం మొత్తంలో ఉన్న 1,55,000 పోస్టాఫీసుల్లో సేవలు లభిస్తాయి. తెలంగాణలో ఈ పేమెంట్ బ్యాంకు సేవలను సెప్టెంబర్ 1న రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించారు.

వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన అనుభవాలతో రాసిన పుస్తకం మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్: ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 2న ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు.

యార్డ్ 45003

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడో తీర గస్తీ నౌక యార్డ్ 45003 ఆగస్టు 28న జలప్రవేశం చేసింది. 102 మంది సిబ్బంది ప్రయాణించే ఈ నౌకలో అత్యాధునిక సమాచార వ్యవస్థలు ఉన్నాయి. ఈ నౌకను చెన్నైలోని కట్టుపల్లి నౌకా నిర్మాణకేంద్రంలో రూపొందించారు.

International

4వ బిమ్‌స్టెక్ సమావేశాలు

నేపాల్ రాజధాని కఠ్మాండులో బంగాళాఖాత పరివేష్టిత దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థ (బిమ్‌స్టెక్) సమావేశాలు ఆగస్టు 30న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ఇతివృత్తం బంగాళాఖాత ప్రాంత శాంతియుత సమృద్ధి సుస్థిరాభివృద్ధి. ఈ కూటమిలో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ సభ్యులుగా ఉన్నాయి. బ్యాంకాక్ తీర్మానం ఆధారంగా 1997 జూన్ 6న బిమ్‌స్టెక్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సమావేశాలు 1997లో థాయ్‌లాండ్‌లో, రెండో సమావేశాలు 2001లో భారత్‌లో, మూడో సమావేశాలు 2014లో మయన్మార్‌లో జరిగాయి.

రక్సాల్- కఠ్మాండు రైల్వే లైన్

భారత్- నేపాల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంలో భాగంగా బీహార్‌లోని రక్సాల్ నుంచి నేపాల్ రాజధాని కఠ్మాండు వరకు రైల్వే లైన్ నిర్మించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. సెప్టెంబర్ 1న కఠ్మాండులో జరిగిన 4వ బిమ్‌స్టెక్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఈ రైలు ఒప్పందం కుదిరింది.

పశుపతి ధర్మశాల

నేపాల్ భారత్‌ల మధ్య స్నేహసంబంధాలకు గుర్తుగా నేపాల్ రాజధాని కఠ్మాండులో నేపాల్- భారత్ మైత్రి పశుపతి ధర్మశాలను ఆగస్టు 31న ప్రారంభించారు. నేపాల్‌లోని 5వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయానికి వచ్చే భక్తుల కోసం 400 గదులతో ఈ విశ్రాంతి మందిరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ ధర్మశాలను రెండు దేశాల ప్రధానులు పశుపతి ప్రాంత అభివృద్ధి మండలికి అందజేశారు.

చైనా- మాల్దీవ్స్ ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్

చైనా-మాల్దీవుల స్నేహానికి గుర్తుగా మాల్దీవుల్లో చైనా నిర్మించిన ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి ప్రారంభమైంది. మాల్దీవుల్లో సముద్రంపై నిర్మించిన తొలి వంతెన ఇదే. 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన మాల్దీవుల రాజధాని మాలేను హుల్‌హులే దీవితో కలుపుతుంది. ఈ వంతెనను నాలుగు వరుసలుగా నిర్మించారు.

కకడు-2018

25 దేశాల నౌకాదళాలు పాల్గొంటున్న కకడు 2018 మారిటైమ్ విన్యాసాలు ఆస్ట్రేలియాలోని పోర్ట్ డార్విన్‌లో ఆగస్టు 29న ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. సముద్ర తీర రక్షణ, భద్రత లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు, 45 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. భారత్ తరఫున ఐఎన్‌ఎస్ సహ్యాద్రి నౌక ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నది. కకడు విన్యాసాలను 1993 నుంచి నిర్వహిస్తున్నారు.

గంగా శుద్ధికి జర్మనీ నిధులు

గంగానదిని శుద్ధిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన క్లీన్ గంగా ప్రాజెక్టుకు జర్మనీ రూ.990 కోట్ల రుణం ఇవ్వనుంది. ఈ నిధులతో గంగా నది వెంట దాదాపు 360 కిలోమీటర్ల దూరం వ్యర్థాలు నదిలో కలువకుండా శుద్ధిచేసే పనులు చేపట్టనున్నారు. అంతే కాకుండా గంగానది పరిరక్షణపై చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు జర్మనీ అభివృద్ధి సంస్థ గంగా బాక్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. డాన్యూబ్ నది రక్షణలో భాగంగా రూపొందించిన డాన్యూబ్ బుక్ మాదిరిగానే గంగా బుక్‌ను కూడా రూపొందిస్తారు.

ఆర్‌సీపీపీ సమావేశాలు

ఆరో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగసామ్య (ఆర్‌సీఈపీ) సమావేశాలు ఆగస్టు 30న సింగపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ప్రభు నాయకత్వం వహించారు. ఆర్‌సీఈపీలో భారత్‌తోపాటు చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు 10 ఆసియన్ దేశాలు (బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం) భాగస్వాములుగా ఉన్నాయి.

Persons

బీకే మిశ్రా

దేశంలో అత్యున్నత వైద్య బహుమతిగా పరిగణించబడుతున్న బీసీ రాయ్ జాతీయ అవార్డును 2018కి గాను ముంబైకి చెందిన ప్రముఖ వైద్యుడు బీకే మిశ్రాకు ప్రకటించారు. ఈ బహుమతిని జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా 2019 జూలై 1న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బీకే మిశ్రా అందుకోనున్నారు. ముంబైలోని పీడీ హిందుజా వైద్యశాలలో బీకే మిశ్రా న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో దేశంలో అత్యున్నత బహుమతిగా ఖ్యాతి పొందిన బీసీ రాయ్ అవార్డును భారతీయ వైద్య మండలి 1976లో ప్రారంభించింది. దేశంలోని తొలి ఆధునిక వైద్యుల్లో ఒకరైన బిధాన్‌చంద్ర రాయ్ జ్ఞాపకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. బీసీ రాయ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

సునీల్ మెహతా

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నూతన చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ సునీల్ మెహతా ఆగస్టు 31న ఎన్నికయ్యారు. 2018-19 ఏడాదికిగాను ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రాతినిథ్యం వహించే సంస్థ ఐబీఎం. దీన్ని 1946 సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో 237 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.

మహమ్మద్ కమాలుద్దిన్

కేంద్ర మాజీ మంత్రి మహ్మద్ కమాలుద్దీన్ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మరణించారు. 1994లో ఆయన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. హన్మకొండ నుంచి మూడుసార్లు, వరంగల్ నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1962, 67 ఎన్నికల్లో ఏపీ శాసనసభకు కూడా ఎన్నియ్యారు. సౌదీ అరేబియాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని సలాఖపూర్.

సత్య త్రిపాఠి

ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా భారత్‌కు చెందిన ఆర్థికవేత్త సత్యత్రిపాఠి ఎంపికయ్యారు. ఆయన న్యూయార్క్‌లోని ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) కార్యాలయ అధిపతిగా కొనసాగుతారు.

మిస్ దివా యూనివర్స్

మిస్ దివా యూనివర్స్-2018 గా నేహాల్ చుడాసమా ఎంపికయ్యారు. ఆమె 2018 మిస్ యూనివర్స్ పోటీల్లో వచ్చే డిసెంబర్‌లో భారత్ తరఫున పాల్గొననున్నారు. ముంబైలో సెప్టెంబర్ 1న జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీల్లో మిస్ దివా సుప్రానేషనల్‌గా అదితి హుండియా, మిస్ దివా రన్నరప్‌గా రోష్నీ షెరన్ నిలిచారు.