సమంతతో గొడవపడటం కష్టంగా వుంది!

ప్రేమమ్ రీమేక్ అనుకున్నప్పుడు వద్దని చాలా మంది సలహాలిచ్చారు. అయితే చందు నన్ను ఒప్పించి నా కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందించాడు. అక్కడి నుంచే చందూపై మంచి నమ్మకం ఏర్పడింది. తను కొత్త తరహా ఫిల్మ్‌మేకర్. కొత్తగా ఆలోచిస్తాడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం సవ్యసాచి. చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో హీరో నాగచైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

సవ్యసాచి ఎలా మొదలైంది?

నార్వేలో ప్రేమమ్ చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో చందు ఈ చిత్ర కథని చెప్పాడు. పాయింట్ నాకు బాగా నచ్చింది. అయితే తను చెప్పినట్టు తీస్తే సినిమా ఓ ప్రయోగంలా వుంటుందేమో అని చిన్న భయం ఏర్పడింది. ప్రేమమ్ విడుదలైన తరువాత నలభైఐదు నిమిషాల పాటు కథకు కావాల్సిన కమర్షియల్ అంశాల్ని జోడించి వినిపించాడు. విన్న తరువాత చాలా నచ్చేసింది.

శైలజారెడ్డి అల్లుడు ఫలితం మిమ్మల్ని నిరాశకు గురిచేసిందా?

ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. అయినా దాని విషయంలో నేను సంతోషంగానే వున్నాను. నా కెరీర్‌లోనే తొలిసారి అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రమది. భారీ స్థాయి వసూళ్లు రాబట్టినా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోవడం నిరాశకు గురిచేసింది.

ప్రతి కథలోనూ మీ ప్రమేయం వుంటుందా?

నా ప్రమేయం ఎంత వరకు ఉండాలో అంతవరకే జోక్యం చేసుకుంటాను. కానీ అంతకు మించి లైన్ దాటి ముందుకు వెళ్లకూడదు. ఎందుకంటే దర్శకుడిని గౌరవించాలి. శైలజారెడ్డి అల్లుడు చిత్ర కథ దర్శకుడు మారుతి చెప్పినప్పుడు బాగానే అనిపించింది. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. అది వర్కవుట్ కాదని ముందే ఊహించలేం కదా. ఎక్కడో తేడా కొట్టింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని వర్కవుట్ కావు.

సవ్యసాచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది వర్కవుట్ అవుతుందని అనిపించిందా?

చందు చెప్పిన పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అయినప్పటికీ ఎక్కడో చిన్న భయం. కానీ దర్శకుడు చందూపై వున్న నమ్మకంతో ఈ చిత్రాన్ని అంగీకరించాను. ప్రేమమ్ రీమేక్ అనుకున్నప్పుడు వద్దని చాలా మంది సలహాలిచ్చారు. అయితే చందు నన్ను ఒప్పించి నా కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందించాడు. అక్కడి నుంచే చందూపై మంచి నమ్మకం ఏర్పడింది. తను కొత్త తరహా ఫిల్మ్‌మేకర్. కొత్తగా ఆలోచిస్తాడు. ఆ నమ్మకం వల్లే తనతో ఈ సినిమా చేశాను. కొంత రష్ చూసిన తరువాత తనపై మరింత నమ్మకం ఏర్పడింది.

సినిమాలో చూపిస్తున్న ఏలియన్ హాండ్ సిండ్రోమ్ గురించి మీకు ముందే తెలుసా?దీని గురించి నేను ఎప్పుడూ వినలేదు కానీ ఈ కథ అనుకున్నప్పుడు యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు, కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు చదివి తెలుసుకున్నాను.

మీ ప్రతి సినిమా విషయంలో నాగార్జున జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ చిత్రాన్ని మీకే వదిలేసారా?

నా ప్రతి సినిమా విషయంలో నాన్న ఎక్కువగా కలగజేసుకోరు. గతంలో కొన్ని చిత్రాల కథలు ఆయనే విన్నారు కానీ ఇప్పుడు ఆ బాధ్యతను నాకే వదిలేశారు. రెండు నెలల క్రితమే నాన్న ఈ సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారు. ఆయన సూచించిన మార్పులు చేశాం. అవి కూడా చిన్నవే భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాల్లోనే మార్పులు చెప్పారు.

సవ్యసాచి సీరియస్‌గా సాగుతుందా? లేక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వుంటుందా?

తొలి భాగం అంతా మేము చెప్పాలనుకున్న వానిష్ సిండ్రోమ్ నేపథ్యంలో సాగుతూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా నాకు, మాధవన్‌కు మధ్య సీరియస్‌గా సాగుతూ థ్రిల్లర్ చిత్రం చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కొన్నికొన్నిసార్లు ఎడమ చేయి నా మాట వినదు. కొన్ని సార్లు ఎడమ చేయికి నాకు మధ్య వార్ జరుగుతూ వుంటుంది.

తొలిసారి మాధవన్‌తో కలసి పనిచేయడం ఎలా వుంది?

చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు చాలా మంది మాధవన్‌ను చూడటానికి రావచ్చా అని అడిగే వారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందాన్ని కలిగించింది. సఖితో కొత్త ట్రెండ్ మొదలుపెట్టిన ఆయన విక్రమ్‌వేదా లాంటి చిత్రాలతో దాన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. ఆయన నుంచి నటుడిగా చాలా నేర్చుకోవాలి.

మైత్రీ మూవీమేకర్స్ గురించి చెప్పాల్సి వస్తే?

నిజాయితీగా మాట్లాడాలంటే నాకున్న మార్కెట్‌కి మించి ఈ చిత్రానికి ఖర్చుచేశారు. ఎంత వసూలు చేస్తుంది? ఎంత మార్కెట్ అవుతుంది? అనే లెక్కలు వేసుకోకుండా కథని నమ్మి ఖర్చు చేశారు. ఇటీవలే సినిమా చూశాను. కీరవాణి అందించిన సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. సెకండ్ హాఫ్‌లో నా పాత్రకు నేపథ్య సంగీతంతో మరింత బలాన్నిచ్చారు.

సమంతకు సినిమా చూపించారా?

ఎడిటింగ్ దశలో చూపించాను. తనకు బాగా నచ్చింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా ఎలా వుండబోతుంది?

సినిమాలో ఇద్దరం పళ్లైన జంటగానే కనిపిస్తాం. అయితే బయట మా మధ్య ఎలాంటి గొడవలు లేవు కానీ సినిమాలో మాత్రం ఎక్కువగా గొడవపడుతుంటాం. అదే నాకు కష్టంగా వుంది.ఈ క్రమంలో ఎవరిని ఎవరు డామినేట్ చేసుకోవడం లేదు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ అనుకోలేదు. ఫిబ్రవరికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. సహజత్వానికి చాలా దగ్గరగా వుండే చిత్రమిది. సమ్మర్‌కు విడుదలవుతుంది. దీనితో పాటు సురేష్ ప్రొడక్షన్స్‌లో వెంకీమామా చిత్రం చేస్తున్నాను. ఇది డిసెంబర్ నుంచి మొదలవుతుంది.

పెళ్లి తరువాత మీలో ఎలాంటి మార్పులొచ్చాయి?

పెళ్లి తరువాత జీవితంలో బ్యాలెన్స్ వచ్చింది. జీవితం పరిపూర్ణంగా అనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది.

ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా వుంటున్నారు. ఒకరి కోసం ఒకరు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు?

వరుస షూటింగ్‌లతో బిజీగా వుండటం వల్ల ఎక్కువగా మాట్లాడుకోలేకపోయాం. అయితే శివా నిర్వాణతో చేస్తున్న సినిమాలో ఇద్దరం కలిసి నటిస్తున్నాం కాబట్టి సెట్‌లోనే ఎక్కువ సమయాన్ని కలిసి గడిపేస్తున్నాం. అంతే కాకుండా ఆదివారాలు షూటింగ్‌లకు దూరంగా వుంటున్నాం.