ఓవర్ నైట్ స్టార్!

మహిళలు, అమ్మాయిలూ రోడ్డుమీద ఒంటరిగా నడవడానికి ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే, వారిపై దేశంలో ఎక్కడో ఓ చోట నిత్యం అరాచకాలు జరుగడమే. అలాంటి ఘటనల గురించి విని, మృగాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు తనకు ఇష్టమున్న చిత్రకళను ఎంచుకున్నది. అంతే, ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.

మహిళలపై నిత్యం జరిగే అరాచకాలను రోజూ వింటున్నాం, టీవీల్లో, పేపర్లలో చూసి బాధపడుతుంటాం. ముంబైకి చెందిన ఈ యువతి కూడా మనలాగే ఆ దారుణాలపై రగిలిపోయేది. ఎలాగైనా తనవంతు అవగాహన తీసుకురావాలని చిత్రకళను ఎంచుకున్నది. ముంబైకి చెందిన 17 యేండ్ల ప్రియాంకపాల్ చిత్రకళలో నైపుణ్యం ఉన్నది. పుస్తకాలు చదివే అలవాటున్న ప్రియాంకకు హర్నిద్‌కౌర్ రచించిన పాంథయాన్ పద్యమంటే చాలా ఇష్టం. దేవతామూర్తులు ఆగ్రహిస్తే అంతా నాశనమే అనేది ఆ పద్యాల సారాంశం. అయితే, దేశంలో పెరుగుతున్న అరాచకాలపై అవగాహన కల్పించేందుకు మంచి సందేశమున్న పాంథయాన్‌ను ఎంచుకున్నది. అలా దేవతా మూర్తులు ఆగ్రహిస్తున్న చిత్రాలను వేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఆ కాన్సెప్ట్ నచ్చినవారంతా వాటిని షేర్ చేస్తుండడంతో అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇలా, మంచి సందేశంతో ముందుకు సాగుతున్న ప్రియాంక ఒక్కరోజులోనే స్టార్ అయిపోయింది. ఆమె చిత్రకళ నచ్చినవారంతా ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రియాంకకు 25వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.