ఎస్‌ఐ మెయిన్స్ విజయానికి చివరి మెట్టు

ఎస్‌ఐ ఉద్యోగ సాధనలో మొదటి అంకమైన ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. మిగిలిన రెండు దశల్లో మొదటిది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), చివరిది మెయిన్స్. ఎస్‌ఐ ఉద్యోగార్థులకు ఈ రెండు విభాగాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రిపరేషన్ సందర్భంగా పాటించాల్సిన మెళకువలు...
-ఫిజికల్ టెస్టులో విజయం సాధించడం ఎస్‌ఐ ఉద్యోగ సాధనలో చాలా కీలకం. ముఖ్యంగా 800 మీటర్ల పరుగును 170 సెకండ్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకండ్లలో పూర్తిచేయాలి. గత నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఈ రెండు ఈవెంట్లలో ఎక్కువ మంది విఫలమయ్యారు. -అభ్యర్థులు లాంగ్ జంప్, హైజంప్‌తోపాటు 800 మీటర్ల పరుగుపైన ఎక్కువగా దృష్టి సారించి సాధన చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. -చాలా మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాసి వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ ప్రాంభించకుండా సమయం వృథా చేస్తుంటారు. ఇది సరైన పద్ధతికాదు. -అభ్యర్థులు వారివారి కేటగిరీల్లో ఉత్తీర్ణత మార్కులు సాధించారా? లేదా? అనేది పీఆర్‌బీ కీని చూసి నిర్ధారించుకోవాలి. పీఆర్‌బీ ప్రకటించిన కీలో కొన్ని తప్పులు ఉన్నాయి. వీటిని ఫైనల్ కీలో సరిచేస్తారు. కాబట్టి కీ తప్పుల గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ ప్రారంభించండి. -అభ్యర్థులు మెయిన్స్‌లో విజయం సాధించాలంటే ముందుగా ప్రిలిమినరీ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఏయే సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయో గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించే దిశగా ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాలి. -ఎస్‌ఐ ఉద్యోగాల నియామకానికి రెండు మూడు నెలల్లో జరుగనున్న పరీక్షలో విజయం సాధించాలంటే మొత్తం సిలబస్‌ను ఒక్కసారి చదివి, వారంవారం మాక్‌టెస్టులు రాయాలి. దీంతో ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. తద్వారా మీ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.
గమనిక: పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు. పేపర్ -3, పేపర్-4 లలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుని అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయిస్తారు. -పేపర్-1, పేపర్-2 అర్హత పరీక్షలు అయినా నెగిటివ్ మార్కులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ, ప్రాక్టీస్ పేపర్లను సాధన చేయాలి.

పేపర్-1 (ఇంగ్లిష్)

-గ్రామీణ ప్రాంత అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను కఠినంగా భావిస్తారు. దీనికి కారణం ఈసారి నెగిటివ్ మార్కుల విధానం అమలు చేయడం. 100 మార్కుల పేపర్‌ను ఎ, బి రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-బి డిస్క్రిప్టివ్ పేపర్. దీనికి 75 మార్కులు. పార్ట్-ఎ ఆబ్జెక్టివ్ పేపర్. దీనికి 25 మార్కులు. పార్ట్-ఎ లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగెటివ్ మార్కుగా నిర్ణయించారు. -పీఆర్‌బీ ప్రకారం ఎస్సెస్సీ స్థాయి ప్రశ్నలను, ముఖ్యంగా Precis Writing, Letter writing, Eassy topics, Reading comprehension, Vocabulary, Grammer మొదలైన టాపిక్స్ నుంచి అడుగుతారు. ఈ పేపర్‌లో ఓసీ అభ్యర్థులు 40 మార్కులు, బీసీలు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 30 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు.

పేపర్-2 (తెలుగు/ ఉర్దూ)

-రెండో పేపర్‌లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదైనా ఒక్క భాషను ఎంచుకోవాలి. -రెండో పేపర్‌కు కూడా మొదటి పేపర్‌లాగే మూడు గంటల సమయం ఇస్తారు. 100 మార్కులు. ఈ పేపర్లో పార్ట్-ఎకు 25 మార్కులు కేటాయించారు. ఇందులో 50 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. సమయం 45 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతున మార్కులు తగ్గిస్తారు. ఈ పేపర్‌లో మరో భాగం పార్ట్-బికి 75 మార్కులు కేటాయించారు. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. పరీక్ష సమయం 2:15 గంటలు. -పేపర్-2లో ఓసీ అభ్యర్థులు 40 మార్కులు, బీసీలు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 30 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. -పేపర్-2 సిలబస్, పేపర్-1 సిలబస్ ఒకేవిధంగా ఉంటుంది.

పేపర్-3 (అర్థమెటిక్-రీజనింగ్)

-ఎస్‌ఐ ఉద్యోగ సాధనలో అతి ముఖ్యమైన పేపర్ ఇది. ఆబ్జెక్టివ్ తరహాలో 200 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం కేటాయించారు. -ఇందులో అర్థమెటిక్, రీజనింగ్ రెండు భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రధానంగా సంఖ్యావ్యవస్థ, బారువడ్డీ, చక్రవడ్డీ, నిష్పత్తి, అనుపాతం, సగటు, శాతాలు, లాభ-నష్టాలు, కాలం-దూరం, కాలం-పని, పని-వేతనాలు, గడియారాలు, క్యాలెండర్, భాగస్వామ్యం, క్షేత్రగణితం మొదలైన అంశాలు సిలబస్‌లో ఉన్నప్పటికీ.. అదనంగా క.సా.గు, గ.సా.భా మిశ్రమాలు, సూక్ష్మీకరణలు, వయస్సులపై, రేఖాగణితం, బీజగణితం మొదలైన టాపిక్స్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. -రీజనింగ్ విభాగంలో వెర్బల్, నాన్‌వెర్బల్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సిరీస్, అనాలజీ, పోలిక పరీక్ష, వెన్ చిత్రాలు, దిశలపై ప్రశ్నలు, రక్తసంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, పజిల్ పరీక్ష, కోడింగ్, డికోడింగ్, ప్రకటనలు-తీర్మానాలు, గణిత ప్రక్రియలు, పాచికలు, చిత్రాలను గణించడం, తప్పిపోయిన సంఖ్యను కనుక్కోవడం మొదలైన టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. -ఈ పేపర్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రతి టాపిక్‌లోని బేసిక్స్‌ను నేర్చుకుని మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫైనల్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. -ఈ పేపర్‌లో ఎక్కువ ప్రశ్నలు సాధిస్తామని మ్యాథ్స్ విద్యార్థులు, తక్కువ మార్కులు వస్తాయని నాన్ మ్యాథ్స్ విద్యార్థులు భావించాల్సిన అవసరం లేదు. ఎవరైతే బేసిక్స్ నేర్చుకుని ఎక్కువ ప్రశ్నలను సాధన చేస్తారో వారే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది.

పేపర్-4 జనరల్ స్టడీస్

-ఈ పేపర్‌కు కూడా 200 మార్కులు, మూడు గంటల సమయం కేటాయించారు. ఈ పేపర్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌లో కింది అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.. -జనరల్ సైన్స్.. అంటే జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శాస్త్ర-సాంకేతిక అంశాలు. -ముఖ్యమైన జాతీయ-అంతర్జాతీయ అంశాలు -భారతదేశ చరిత్ర (రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు), భారతదేశ జాతీయోద్యమ చరిత్ర. -భారతదేశ భౌగోళిక శాస్త్రం -ఇండియన్ పాలిటీ -భారత ఆర్థిక వ్యవస్థ -తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశలు -పర్సనాలిటీ పరీక్ష (ఎథిక్స్, సెన్సివిటీ జెండర్, బలహీన వర్గాలు, సోషల్ అవేర్‌నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్) -ఈ పేపర్‌లో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పలేం. గత ప్రశ్నపత్రాల ప్రకారం.. చరిత్ర (భారతదేశ, తెలంగాణ), జనరల్ సైన్స్, జాగ్రఫీ (భారతదేశ, తెలంగాణ), పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఆర్థిక వ్యవస్థ మొదలైన సబ్జెక్టులను ప్రాధాన్యత ప్రకారం చదివితే ఈ పేపర్‌లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. -పదిరోజుల క్రితం జరిగిన ప్రిలిమినరీ పరీక్ష, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే రోజురోజుకు జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల కఠినస్థాయి పెరుగుతున్నది. ఈ ప్రశ్నలు గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిలో ఉంటున్నాయి. కాబట్టి మీరు ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలంటే గ్రూప్-2లో జనరల్ స్టడీస్ చదవాలి. -జనరల్ స్టడీస్‌లోని అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే మొదట ప్రతి సబ్జెక్టును బేసిక్స్ నుంచి చదివి, ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని క్రమం తప్పకుండా ప్రశ్నలను సాధన చేయాలి.