ఉపదేశ నియమాలు

సద్గురువు సన్నిధిని చేరిన మానవులు ధన్యులు. ఎం దుకంటే, వారు ఈ భౌతిక ప్రపంచంలోనే మునిగిపోకుం డా పారమార్థిక దృష్టి కలవారై సదాచార్యుల నుంచి ఆత్మహితాన్ని పొందాలని భావిస్తారు. సదాచార్యులు తమను ఆశ్రయించిన శిష్యులందరికి బ్రహ్మ విద్యలను బోధించరు. ఉపనిషద్వాఙ్మయాన్ని ఉపదేశించరు. సద్గురువులు ముం దుగా శిష్యుల శ్రద్ధాసక్తులను క్షుణ్ణంగా పరిశీలించి యోగ్యు లైన శిష్యులను ఎంపిక చేసుకొని వారికి మాత్రమే మంత్రాలను, మహోన్నతములైన విద్యలను ఉపదేశిస్తారు. విలువైన వస్తువును ఎవరికి పడితే వారికి ఇవ్వరు కదా! వస్తువు ఉపయోగాన్ని తెలిసిన వారికి, దాన్ని భద్రంగా కాపాడుకునే వారికి మాత్రమే ఇస్తారు కదా! అట్లే గురువుల కూడా తత్త్వజ్ఞానాన్ని, బ్రహ్మవిద్యలను, వేద వాఙ్మయాన్ని ఎవరికి పడితే వారికి బోధించరు. నియమాలను అనుసరించి అర్హులైన వారికే ఉపదేశిస్తారు. పూర్వం పిప్పలాదుడు తన దగ్గరకు వచ్చిన సుకేశాదులకు మీకు అవసరమైన విద్యను నేను ఉపదేశించాలంటే, నా దగ్గర ఒక సంవత్సర కాలం ఉండాలి అనే నియమాన్ని తెలిపారు. సుకేశాదులు ఆ ఉపదేశ నియమాన్ని పాటించి విద్యలను పొందారు. శ్వేతకేతువు ఆచార్యుడైన ఆరుణి సద్విద్యా ప్రవర్తకుడిగా సుప్రసిద్ధిని పొందినవాడైనను తనకు తెలియని పంచాగ్ని విద్య కోసం ప్రవాహణుని దగ్గరకు వెళ్లి చిర కాలం నిరీక్షించిన తరువాతనే గురువు నుంచి పంచాగ్ని విద్యను పొందెను.రైక్వుడు జానశ్రుతి సంపదలను చూడకుండా, అతని ఆర్తిని, శ్రద్ధాసక్తులను గుర్తించిన తరువాతనే బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. మంత్రం యత్నేన గోపయేత్ అనే శాస్ర్తోక్తిని అనుసరించి అర్హులైన వారికే మంత్రాన్ని అందించాలనే లక్ష్యంతో 17 సార్లు తమ వద్దకు వచ్చినను రామానుజులకు ఉపదేశించని ఆచార్యులు, రామానుజులవారి శ్రద్ధకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందిన వారై ఈ సారి మీరు ఒంటరిగా రండి అని పలికి 18వ సా రి వచ్చిన రామానుజుల వారికి ఆచార్యులు మంత్రాన్ని (మంత్రార్థాన్ని) ఉపదేశించారు. సంవత్సరం గాని, అర్ధ సంవత్సరంగాని సేవచేసిన వారికి మాత్రమే అందించే ఉపదేశాన్ని భగవద్రామానుజులు కొంతకాలం ఉపవాస దీక్షను కొనసాగించిన తర్వాత కూరేశులకు ఉపదేశించారు. అయితే, గురువుల ఉపదేశాన్ని పొందడానికి ఎన్నో నియమాలుంటాయి. అందరూ ఈ నియమాలను పాటించగలుగుతారో లేదో, నియమాలు పాటించలేనివారు కూడా మంత్రానికి సంప్రదాయానికి దూరం కాకూడదని భావించిన కృపామాత్ర ప్రసన్నాచార్యులైన భగవద్రామానుజుల వారు తిరుక్కోట్టియూర్‌లోని దేవాలయ గోపురమెక్కి ఎందరెందరికో మంత్రాన్ని (మంత్రార్థాన్ని) అనుగ్రహించారు. పరమ దయాళువులైన మహనీయులైన భగవద్రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా వారి అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం.