ఉజ్వల ప్రగతి!

పెద్దయ్యాక ఏమవుతావు? అని ఎవరైనా అడిగితే టీచర్‌ని అవుతా.. పోలీస్‌ను అవుతా.. లీడర్‌ను అవుతా అని చెప్తుంటారు పాఠశాల విద్యార్థులు. కానీ కేరళలోని కొట్టప్పాడంకు చెందిన లావణ్య సుధీంద్రన్ చిన్నప్పుడే నేను ఉష్ణగతిక శాస్త్రంలో గొప్ప పేరు సంపాదించాలని ఉంది అని చెప్పిందట.

లావణ్య సుధీంద్రన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. రసాయన శాస్త్రంలో ఆమె నేషనల్ రెండో ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన గిరిజన యువతిగా ఇటీవల రికార్డు సృష్టించింది. అయితే ఒక ట్రైబల్ అమ్మాయిగా లావణ్య సృష్టించిన రికార్డ్ మామూలుది కాదు. లావణ్య వాళ్ల నాన్న నిరుపేద లారీ డ్రైవర్. పదిహేను రోజులకోసారి ఇంటికి వెళితే.. అతని కోసం.. అతడు తీసుకొచ్చే డబ్బుల కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూసేవారు. తండ్రి కృషిని.. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న కూతురు లావణ్య సుధీంద్రన్ పాఠశాల స్థాయి నుంచే చదువుల్లో రాణించేది. ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో చదువుకున్న ఆమె పరిశోధనవైపు ఆకర్షితురాలైంది. ఉత్తమ ప్రతిభ కనబరుస్తుండటంతో షెడ్యూల్డ్ క్యాస్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ వరకు వెళ్లింది. కోజికోడ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కింద ఆమె ఇప్పుడు ఉష్ణగతిక శాస్త్రంలో పరిశోధన చేసేందుకు అమెరికా ప్రయాణమైంది. పరిశోధనలో మంచి నైపుణ్యం కనబర్చి ఉష్ణగతిక శాస్త్రంలో ప్రావీణ్యురాలిని అవుతానంటున్నది లావణ్య.