ఈ ఓయో కుర్రాడు.. ఓ బిలియనీర్!

హే మామా.. యోయో.. అంటూ తిరిగే వయసులో ఓయో కంపెనీ స్థాపించి కోటీశ్వరుడయ్యాడు ఈ కుర్రాడు. వయసు కేవలం 21 సంవత్సరాలే. కానీ, ఇతగాడి సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల 2,600 కోట్ల రూపాయలు. ఇంతలా సంపాదించాడంటే.. అల్లరి చిల్లరిగా ఊరూరు తిరిగిన అనుభవమే. అదెలాగంటారా...? అయితే ఓయో రూమ్స్ రితేశ్ అగర్వాల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈమధ్య పెద్ద పెద్ద ఓయో రూమ్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. కారణం.. ఓయో రూమ్స్ ఓ బ్రాండ్‌గా మారిపోవడమే. పరిశుభ్రత, నాణ్యత, మెరుగైన సౌకర్యాలకు మారు పేరు ఓయో రూమ్స్. దీని సృష్టికర్తే ఈ రితేశ్ అగర్వాల్. ఇంటర్ తర్వాత చదువుకు స్వస్తి చెప్పి.. ప్రయాణాలు ప్రారంభించాడు రితేశ్. దేశంలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. కొద్ది వయసులోనే ఎంతో అనుభవాన్ని గడించాడు. తన ప్రయాణాల్లో కొన్ని హోటల్స్ బయటి నుంచి చూస్తే బాగానే ఉన్నా.. లోపలి రూములు అపరిశుభ్రంగా ఉండేవి. మాసిపోయిన దుప్పట్లు, నీళ్లు లేని బాత్రూమ్‌లు, ఆహారం రుచిగా ఉండకపోవడం వంటివి ప్రత్యక్షంగా అనుభవించాడు. వందల కొద్దీ హోటళ్లను దగ్గరగా పరిశీలించాడు. అప్పుడే తన మదిలో ఈ వ్యాపార ఆలోచన మొలకెత్తింది.

ఒరావెల్ స్టేస్ నుంచి ఓయో రూమ్స్..

2011లో కటక్ నుంచి ఢిల్లీకి మకాం మార్చి.. తన 19వ యేట హోటల్ బుకింగ్ సర్వీసెస్ కంపెనీ ఒరావెల్ స్టేస్‌ను స్థాపించాడు రితేశ్. తక్కువ బడ్జెట్‌లో హోటల్ కోసం వెతికే వారినే టార్గెట్ కస్టమర్లుగా చేసుకున్నాడు. ఈ ఆలోచన మెచ్చి వెంచర్ నర్సరీ అనే సంస్థ రితేశ్ కంపెనీలో రూ.30 లక్షల పెట్టుబడి పెట్టింది. తన ఐడియాను థీల్ ఫెలోషిప్ కాంటెస్ట్‌లో వివరించాడు రితేశ్. ఇందులో 22 యేండ్లలోపు ఉండి.. కాలేజీ మానేసిన వారు తమ ఐడియాలను పంచుకోవచ్చు. దీనిని అమెరికన్ ఇన్వెస్టర్ థీల్ (పేపాల్ కో-ఫౌండర్) నిర్వహిస్తున్నాడు. ఇందులో ఇండియా నుంచి ఎంపికైనా ఏకైక వ్యక్తి రితేశ్. దీంతో లక్ష డాలర్ల పారితోషికంతో పాటు ఏడాది ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఓరావెల్ స్టేస్ కేవలం హోటల్ రూములు, గెస్ట్ ఉండడం వరకే పరిమితమైంది. కానీ సౌకర్యాలు ఆయా హోటళ్ల యాజమాన్యంపైనే ఆధారపడి ఉండేవి. దీంతో తన కస్టమర్ల కోసం కొత్తగా ఏదైనా చెయ్యాలనుకొని ఓయో రూమ్స్‌కూ కార్యరూపం ఇచ్చాడు.

పరిశుభ్రతకు మారుపేరు..

బిజినెస్, విహారయాత్రలు, ఆఫీస్ క్యాంపులు, అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసేవారికి ఈ ఓయో రూమ్స్ మంచి చాయిస్. స్మార్ట్‌ఫోన్ నుంచి ఓయో రూమ్స్ యాప్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకున్నవారికి మెరుగైన సౌకర్యాలు అందుతాయి. తక్కువ ధరకే ఏసీ రూములు, శుభ్రమైన దుప్పట్లు, మంచం, బాత్రూంలు, ఉచిత ఇంటర్నెట్, ఉచిత బ్రేక్ ఫాస్ట్, టీవీ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. కస్టమర్ రూములోకి ఎంటరైనప్పుడు సబ్బు, షాంపూ, బాడీ వాష్‌లతో కూడిన కిట్‌ను అందిస్తారు. ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని హోటళ్లలో ఈ స్టాండర్డ్ సౌకర్యాలు తప్పనిసరి. ఓయో వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా ఏ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నా సౌకర్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారు వినియోగదారులు. 2013 జనవరిలో ఒక హోటల్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ప్రస్తుతం 230 సిటీలలో 8500 హోటళ్లతో భారతదేశంలో అతిపెద్ద హోటల్, హాస్పిటాలిటీ నెట్‌వర్క్‌గా ఎదిగింది.

ఇదే అసలు టెక్నిక్..

కొన్ని వెబ్‌సైట్‌లు, యాప్‌లు హోటళ్ల పేర్లను లిస్ట్ చేసి వచ్చే బిజినెస్‌లో కమీషన్ పొందుతాయి. ఓయో రూమ్స్‌ది ఆ విధానం కాదు. కో బ్రాండింగ్ పద్ధతి ద్వారా హోటల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా లొకేషన్ మ్యాప్‌ను చూపిస్తూ.. రూమ్స్‌ను రీసేల్ చేస్తుంది. రీసేల్ అంటే ఒక వస్తువుని కొని తిరిగి అమ్మడం రీసేల్.. ఓయో వ్యాపార సూత్రం కూడా ఇదే. ఇంకొంచెం క్లుప్తంగా చెప్పాలంటే.. ఒక పేరున్న హోటల్‌లో రోజుకి రూ.2 వేల అద్దె గల ఒక రూమును రూ. వెయ్యికే నెలసరి కాంట్రాక్ట్‌గా తీసుకుంటుంది ఓయో. తిరిగి అదే రూమును తన యాప్ ద్వారా రూ.1,200కు రీసేల్ చేస్తుంది. హోటల్ వ్యాపార సూత్రం ప్రకారం ఎంతటి పేరున్న హోటలైనా నెల మొత్తం రోజులు రూములు బుక్ అవడం జరుగదు. కాబట్టే ఈ ఒప్పందం వారికి ఆదాయమే. తద్వారా ఓయోకూ లాభమే.

ఆదాయం రూ.2,600 కోట్లు..

1993 నవంబర్ 16న ఒడిశాలోని కటక్‌లో ఒక వ్యాపారి కుటుంబంలో జన్మించాడు రితేశ్. బాల్యం, స్కూల్ డేస్ కటక్‌లోనే గడిచాయి. అతిచిన్న వయసులోనే కంప్యూటర్స్ పైన ఆసక్తి పెంచుకున్న రితేశ్.. 8 యేండ్లకే పాస్కల్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజిలలో కోడ్ రాసేవాడు. కన్జ్యూమర్ టెక్నాలజీ విభాగంలో ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్‌లో స్థానం సంపాదించాడు కూడా. 2015లో బిజినెస్ వరల్డ్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ పొందాడు. వివిధ సంస్థలు ప్రకటించిన టాప్ 10 ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు రితేశ్. మొదలు పెట్టిన ఐదేండ్లలోనే ఇండియాలో టాప్ 5 స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది ఓయో. ప్రస్తుతం ఓయో రూమ్స్ ఇప్పటివరకు ఆదాయం 2,600 కోట్ల రూపాయలు. ఇతను ఇండియాలో యంగెస్ట్ సెల్ఫ్‌మేడ్ బిజినెస్ మ్యాన్. ఓయోను చూసి ఇతర దేశాల్లో కూడా అలాంటి కంపెనీలను స్థాపించారు. ప్రస్తుతం మన దేశంలో అతిపెద్ద కంపెనీగా ఉన్నాం. ఇంకో పదేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీగా మారాలనేది మా లక్ష్యం అంటున్నాడు రితేశ్. ఓయో రూమ్స్‌లో సాఫ్ట్ బ్యాంక్, సీక్వోవియా వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు.