పండు ఫొటో తీస్తే పెళ్లి అయిపోద్ది

సుదీర్ఘ విరామం తర్వాత హాస్యనటుడు అలీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పండుగాడి ఫొటో స్టూడియో. వీడు ఫొటో తీస్తే పెళ్లి అయిపోద్ది ఉపశీర్షిక. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌రాజా దర్శకుడు. రిషిత కథానాయిక. ఇటీవలే ఏపీలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్‌నిచ్చారు. ఏపీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామెడీ చిత్రాలు తగ్గుముఖం పట్టిన తరుణంలో హాస్యప్రియులకు ఈ చిత్రం విందుభోజనంగా నిలవాలి అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. పండు అనే ఫొటోగ్రాఫర్ కథతో తెరకెక్కిస్తున్నాం. ఫొటోస్టూడియో ఓనరైన అతడి జీవితగమనంలో చోటుచేసుకునే సంఘటనలు నవ్విస్తాయి. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గుంటూరు జిల్లా తెనాలిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నాం అని తెలిపారు. చాలాకాలం తర్వాత తాను చేస్తున్న పూర్తిస్థాయి కామెడీ చిత్రమిదని అలీ చెప్పారు. ప్రదీప్‌రావత్, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.