మరింత బాధ్యత పెరిగింది!

ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రను పోషిస్తున్నది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. భారతీయ చిత్రసీమకు గర్వకారణమైన అందాల అభినేత్రి శ్రీదేవి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిందీ సుందరి. ఆమె మాట్లాడుతూ నాకు లభించిన అరుదైన గౌరవమిది. తొలుత దర్శకనిర్మాతలు శ్రీదేవి పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు ఒక లెజెండరీ నటి పాత్రకు నేను న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. వారిచ్చిన భరోసాతోనే సినిమాకు అంగీకరించాను. శ్రీదేవి భారతీయులందరి అభిమానం చూరగొన్న గొప్ప నటి. ఆమె పాత్రను పోషించడం నాపై మరింత బాధ్యతను పెంచింది. శ్రీదేవి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయగలననే నమ్మకం ఉంది. నా కెరీర్‌లో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయే చిత్రమవుతుంది అని చెప్పింది.

బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఎన్టీఆర్-శ్రీదేవి కలిసి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రకు ప్రాముఖ్యత ఏర్పడింది. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. మరోవైపు స్పైడర్ తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో మరే చిత్రానికి అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు, హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్నది.