ఇక్కడ హిట్టు.. అక్కడ ఆకట్టు!

కథలో దమ్ముంటే ఏ సినిమా అయినా హిట్టు అవుతుందని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. తెలుగులో హిట్టయిన ఎన్నో సినిమాలు హిందీతో పాటు చాలా భారతీయ భాషల్లో విడుదలయ్యాయి.అక్కడ కూడా ఆడి నిర్మాతల జేబులు నింపాయి. దర్శకుల ప్రతిభను చాటాయి. నటీనటులకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేశాయి.అలా తెలుగులో హిట్టయ్యి.. హిందీలో రీమేక్ అయిన సినిమాల సమాహారమిది.

అర్జున్‌రెడ్డి - కబీర్ సింగ్

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల లిస్ట్‌లో అర్జున్‌రెడ్డి ఒకటి. తెలుగు సినిమా కమర్షియల్ పంథాను కొత్తదారిలోకి తీసుకెళ్లి తారాస్థాయిలో నిలబెట్టింది. అర్జున్‌రెడ్డి ఇప్పుడు హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయింది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగ హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. టీజర్ విడుదలై సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. చూస్తుంటే.. హీరోగా షాహిద్ కపూర్, హీరోయిన్ కైరా అద్వానీ తమ పాత్రలకు న్యాయం చేయనున్నట్టు అనిపిస్తుంది.

టెంపర్ - సింబా

పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ తెలుగులో అడపాదడపా ఆడినా.. హిందీలో రీమేక్ చేసే వరకు వెళ్లింది. హిందీలో ఎన్టీఆర్ పాత్రను రణ్‌వీర్‌సింగ్ పోషించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకొని కమర్షియల్‌గా బాగా ఆడింది.

శుభలగ్నం - జుదాయి

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో, 1994లో విడుదలైన సినిమా శుభలగ్నం. జగపతిబాబు, ఆమని, రోజా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 1997లో అనిల్ కపూర్, శ్రీదేవి, ఊర్మిళ కలిసి హిందీ జుదాయిలో కనిపించారు. ఈ సినిమా మూలకథ ఆధారంగా 2011లో లైఫ్స్ ఓకే ఛానల్ సీరియల్‌గా కూడా వచ్చింది.

మరో చరిత్ర - ఏక్ దుజే కే లియే

కమల్‌హాసన్, సరిత జంటగా నటించిన మరో చరిత్ర తెలుగులో విజయం సాధించి హిందీలో ఏక్ దుజే కేలియే పేరుతో రీమేక్ అయింది. 1978లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు తర్వాత తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ అయింది. తెలుగులో విజయం సాధించిన మూడేండ్లకు ఈ సినిమా హిందీలో విడుదలయింది.

పోకిరి - వాంటెడ్

గ్యాంగ్‌స్టర్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పోకిరి ఇటు పూరి జగన్నాథ్, అటు మహేష్‌బాబు కెరీర్‌లో బెస్ట్ పిక్చర్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో రికార్డులు బ్రేక్ చేసింది. ఇదే చిత్రం 2009లో హిందీలో వాంటెడ్‌గా వచ్చింది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా టాకీయాలు జంటగా నటించారు. దీంతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయి విజయవంతంగా ఆడింది.

అతడు : ఏక్.. పవర్ ఆఫ్ వన్

మహేష్ బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సూపర్‌హిట్ చిత్రమిది. ఇది టాలీవుడ్‌లో అధిక వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇదే చిత్రాన్ని దర్శకుడు సంగీత్ శివన్.. బాబీ డియోల్, శ్రియా శరణ్‌లతో రూపొందించాడు. ఆ తర్వాత బెంగాలీలో కూడా రీమేక్ అయి హిట్ టాక్ అందుకున్నది. ఇలా తెలుగులో హిట్టయ్యి.. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో రీమేక్ అయ్యి హిట్టయిన చిత్రాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమార్కుడు.. రౌడీ రాథోడ్, రెడీ.. రెడీ, మర్యాద రామన్న, సన్ ఆఫ్ సర్ధార్, కిక్.. కిక్, కందిరీగ.. మై తేరా హీరో, ఒక్కడు.. తేవర్‌లుగా వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.
More