ఆరు పలకల అమ్మాయి

వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం ఉన్న వారు మనకు కనిపిస్తుంటారు. ఈమె కూడా అంతే.. బరువైన దేహంతో ఇంట్లో మెట్లు కూడా ఎక్కలేకపోయింది. పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. చెమట చిందించనిదే.. ఫలితం లేదనుకొని, పట్టుదలతో ప్రయత్నించింది. అంతే.. ఈ ఏడాది మిస్ ఇండియా ఫిట్‌నెస్ పోటీల్లో తన సత్తా చూపించింది.

టీనేజ్‌లోనే 80 కేజీల బరువుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది మధు ఝా. తన ఊబకాయం కారణంగా ఎన్నో అవమానాలను, హేళనలను భరించింది. చివరికి నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడంతో ఆలోచనలో పడింది. ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నది. మెల్లిగా జిమ్ బాట పట్టింది. క్రమక్రమంగా కండలను కరిగించడం మొదలుపెట్టింది. నిత్యం చెమట చిందించే వ్యాయామం చేస్తూ, అందుకు సరిపడిన ఆహారం మాత్రమే తీసుకుంటూ బాగా కష్టించింది. 21 రోజుల్లోనే ఫలితం కనిపించడంతో మధులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. రోజూ జిమ్‌లో వర్క్‌అవుట్‌లు చేస్తూ కొద్దికాలంలోనే సిక్స్‌ప్యాక్స్ సొంతం చేసుకున్నది. అదే పట్టుదలతో ఫిట్‌నెస్ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో బహుమతులు సాధించింది మధు. ఈ ఏడాది నోయిడాలో జరిగిన ఉమెన్ ఫిట్‌నెస్ చాంపియన్ షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎన్‌బీబీయూఐలో ప్రోకార్డు హోల్డర్‌గా మారిన తొలి భారతీయ మహిళ మధు ఝా.