ఆయుర్వేద గ్రామం!

రణగొణ ధ్వనులు వినిపించే మహా నగరాల నుంచి.. కాసేపు సేదతీరడానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి.. ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు పర్‌ఫెక్ట్ డెస్టినేషన్ కేరళ.. పచ్చని ప్రకృతి రమణీయతతో పాటు.. ఆయుర్వేద వైద్యాన్ని పొందడానికి కైరాలీ దాకా వెళ్లిరండి.. అటు సేద తీరొచ్చు.. ఇటు ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.. అలాగే దగ్గర్లోని కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి.. ఆ వివరాలే ఈ వారం విహారంలో

పచ్చని ప్రకృతి.. పక్షుల కిలకిలరావాలు.. నెమళ్ల నాట్యాలు.. ఆ మధ్యలో చిన్న చిన్న బంగ్లాలు.. పారే సెలయేరులో చిన్నచిన్న చేప పిల్లలు.. ఇంత రమణీయంగా ఉండే దృశ్యాలను కేరళలోని కైరాలీ ఆయుర్వేద గ్రామంలో చూడొచ్చు. పాలక్కడ్ నుంచి గంట ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకుంటాం. ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే కోయంబత్తూరు లేదా కొచ్చి వరకు ైఫ్లెట్‌లో వెళ్లొచ్చు. లేదా రైలు ప్రయాణంతోనైనా చేరుకోవచ్చు. అక్కడి నుంచి గంటన్నర ప్రయాణిస్తే పాలక్కడ్‌లోని కైరాలీ ఆయుర్వేద గ్రామానికి చేరుకోవచ్చు. అలా మొదలైంది : కె.వి.రమేష్, గీతా రమేష్ అనే దంపతులు ఈ ఆయుర్వేద గ్రామ నిర్మాణానికి పూనుకున్నారు. 100 శాతం ఆర్గానిక్ ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో 1998లో కైరాలీ ఆయుర్వేదిక్ సెంటర్‌ని పాలక్కడ్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడిది 9 దేశాల్లో 35 ట్రీట్‌మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చెందింది. పాలక్కడ్‌లోని ఈ రిసార్ట్‌కి కూడా దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ స్పా చేయించుకోవడానికి ప్రత్యేకంగా వచ్చే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. ఇక్కడ ఎన్నో హెల్దీ ప్రొడక్ట్‌లు కూడా లభ్యమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 వెల్‌నెస్ డెస్టినేషనల్‌లలో కైరాలీ ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. లీడింగ్ స్పా రిసార్ట్, బెస్ట్ ఫర్ యోగా.. ఇలా చెబుతూ పోతే చాలా అవార్డులు ఈ రిసార్ట్‌కి లభించాయి.

పచ్చని గ్రామం..

కైరాలీకి చేరుకోగానే పచ్చని కొబ్బరి చెట్లు మనల్ని స్వాగతిస్తాయి. అక్కడకు వెళ్లిన తర్వాత రిసెప్షన్ కౌంటర్ దగ్గర కేరళ సంప్రదాయం ప్రకారం గంధం బొట్టు పెట్టి, చిన్న తువ్వాలతో సత్కరిస్తారు. కైరాలీ గ్రామం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 15 ఎకరాల వరకు రిసార్ట్ నిర్మించారు. మొత్తం 30 భవనాలు ఉంటాయి. ప్రతీ బంగ్లాకి మధ్య కనీసం వంద అడుగుల దూరం ఉంటుంది. మధ్యలో చిన్న పిల్ల కాలువ అందులో చేపలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పచ్చని గడ్డి, వివిధ రకాల చెట్లు ఎక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఇక్కడ ఆయుర్వేద వైద్యానికి పనికొచ్చే మొక్కలే. ఇక ఒక్కో గదికో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పాత కాలం నాటి మంచాలు, కబోర్డ్, టీవీ, కుర్చీలు, అధునాతను చూపించే బాత్రూమ్‌లు ఉంటాయి. కచ్చితంగా ప్రతీ గదిలో ఒక శంఖం ఉంటుంది. దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయని వారి నమ్మకం. ఈ 15 ఎకరాలను వదిలిపెడితే మిగతా అంతా అటవీ ప్రాంతం. దాంట్లో కూడా ఔషధ మొక్కలు, రిస్టార్ట్‌కి అవసరమయ్యే ఆహార పదార్థాలను, వరిని పండిస్తారు.

ప్రత్యేక వైద్యం..

ఇక్కడ మనం సేదతీరడం మాత్రమే కాదు.. మన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా పొందొచ్చు. ఈ రిస్టార్ట్‌లోకి వెళ్లగానే మనం ఏ వైద్యుడిని సంప్రదించాలి, ఏ సమయానికి అనే సమాచారాన్ని అందిస్తారు అక్కడివారు. అందుకనుగుణంగా మన షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తారు. మన సమస్యలను బట్టి ఇక్కడ పంచకర్మ, అభ్యంగన, శిరోధార.. వంటి స్పా లని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మసాజ్ చేసేవాళ్లు ఉంటారు. ఆడవాళ్లయితే కేరళ కట్టుతో కనిపిస్తారు. ఒక్కొక్కరికీ ఇద్దరు చొప్పున మసాజ్ చేస్తుంటారు. ఇందులో మగవారికి మగవారే స్పా చేస్తారు. ఈ రిసార్ట్‌లో ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్తారు. అది కూడా తగిన మోతాదులో! స్పైసీని ఇష్టపడేవాళ్లకి ఈ వంటకాలు నచ్చకపోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మించిం ది ఏం లేదనుకుంటే మాత్రం లాగించేయొచ్చు.

టిప్పుసుల్తాన్ కోట

కైరాలీ నుంచి గంట ప్రయాణిస్తే ఈ కోటకి చేరుకోవచ్చు. పాలక్కడ్‌లో ఇది ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. క్రీ.శ. 1766లో ఈ కోటని నిర్మించారు. హైదర్ అలీ ఈ కోటను నిర్మించాడు. టిప్పు సైన్యం ఈ కోటలో ఉండేది. ఇక్కడే ఏనుగులు, గుర్రాలకు సేవ చేసే వారని ప్రతీతి. ఈ కోట మధ్యలో టౌన్ హాల్ ఉంటుంది. దీన్నే కోట మైదానం అని పిలుస్తారు. ఈ మైదానాన్ని ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్‌గా మార్చేశారు. పబ్లిక్ మీటింగ్‌లకు, ఎగ్జిబిషన్‌లు నిర్వహించడానికి ఈ మైదానాన్ని వాడుతున్నారు. అంతేకాదు.. ఈ కోటలో చిన్న పార్క్ కూడా దర్శనమిస్తుంది. ఇందులో సబ్ జైల్ ఉంది. ఆంజనేయ స్వామి గుడి ఈ కోటలో ఉండడం విశేషం. ఈ కోటలో ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఇండ్లు కట్టి గవర్నమెంటు ఆఫీసులను నిర్వహిస్తున్నారు.

మలమ్‌ఫూజా డ్యామ్

కేరళలోని రెండవ అతిపెద్ద రిజర్వాయర్ ఇది. పాలక్కడ్‌కి.. కైరాలీ సెంటర్‌కి మధ్యలో ఇది ఉంటుంది. మలమ్‌ఫూజా నది మీద ఈ డ్యామ్‌ని కట్టారు. మట్టి, రాతితో ఈ డ్యామ్‌ని నిర్మించారు. 220 మీటర్ల పొడవు, 355 అడుగుల ఎత్తుతో ఈ డ్యామ్ ఉంటుంది. సుమారు 42వేల హెక్టార్లకు పైగా ఈ డ్యామ్ ద్వారా నీళ్లను సరఫరా చేస్తున్నారు. రెండు ఉపకాలువల వ్యవస్థతో ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఇక్కడికి వెళితే డ్యామ్ ఒక్కటి చూసి రావడం కాదు. ఇక్కడ ఎంట్రెన్స్ గార్డెన్, యాక్షీ, జపనీస్, ఉప్పర్ గార్డెన్‌లు ఆకట్టుకుంటాయి. -సౌమ్య నాగపురి