ఆదర్శ గురుశిష్యులు

మానవ జీవితంలో గురుశిష్య బంధం అత్యంత ప్రధానమైనది. పరమ పవిత్రమైనది కూడా! సమర్థుడైన గురువు లభిస్తేనే శిష్యుని జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. యోగ్యుడైన శిష్యుడు లభించకపోతే, గురువు విద్యకు ప్రకా శం ఉండదు. గురువు సన్నిధిలో బ్రహ్మ విద్యను అభ్యసింపదలచిన శిష్యునికి తగిన శ్రద్ధ, అధిక జిజ్ఞాస ఉండాలి. శిష్యుడిలో ప్రలోభాలు ప్రవేశిస్తే శ్రద్ధ సన్నగిల్లుతుంది. జిజ్ఞా స అడుగంటిపోతుంది.అయితే, నచికేతుడు అనే శిష్యుడు మాత్రం ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. పరమ రహస్యమై న మోక్ష విద్యయే తనకు కావాలని పట్టుబట్టి మరీ యముని వద్ద బ్రహ్మ విద్యను అభ్యసించాడు. ఆదర్శ శిష్యునిగా ప్రఖ్యాతిని పొందాడు. యముడు ఉత్తమాచార్యునిగా ఘనకీర్తిని ఆర్జించినాడు. శిష్యునిలో యోగ్యత ఉన్నదా, లేదా అని పరీక్షించిన తర్వాతనే బ్రహ్మ విద్యలను ఉపదేశించాలి. అందుకే సుచిరకాలం గురువుకు శిష్యుడు శుశ్రూష లు చేయాలనే నియమనిష్ఠలను ఏర్పరచినారు. యముడు నచికేతుని అంతరంగాన్ని నిశితంగా పరిశీలించాడు. నచికేతునిలో మర్మాలు, మాలిన్యాలు లేవు. కల్మషం కానరాలేదు. ఇతడు మోక్ష విద్యోపదేశానికి యోగ్యుడు అని నిర్ధారించుకున్నాడు యముడు. అందుకే ఇదివరలో చెప్పనుగాక చెప్పను అని భీష్మించుకున్న యముడు ఇట్లాంటి యోగ్యశిష్యుడు తనకు లభించడం గొప్ప అదృష్టమని భావించి బ్రహ్మవి ద్యను ఉపదేశించాడు. తనవద్ద బ్రహ్మ విద్యను, మోక్ష రహస్యాన్ని వింటున్న నచికేతుని ముఖంలో వెలసిన వెలుగులను చూసి యముడు ఆనందంతో పరవశించిపోయాడు. ఓ నచికేతా! నీవల్ల నీ పూర్వులు, ఉత్తరోత్తరులంద రు తరించాలని పేర్కొన్నాడు. సకల సద్గుణాలు నిండుగా కలిగిన శ్రీరామలక్ష్మణులు తనకు శిష్యులుగా లభించారనే సంతోషంతో విశ్వామిత్ర మహర్షి శస్త్ర విద్యలను ఎన్నింటినో వారికి ఉపదేశించాడు. శస్త్ర విద్యలనుపదేశించి, తమచేత యాగ రక్షణ జరిపించి, తమకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కలుగునట్లు సంకల్పించిన ఆదర్శ గురువులు అయిన విశ్వామిత్ర మహర్షి పట్ల శ్రీరామలక్ష్మణులు విధేయులై ఉండి ఆదర్శ శిష్యులుగా ప్రసిద్ధులయ్యారు. సహస్రాబ్ది సందర్భంగా అనేక ప్రదేశాల్లో అధిక సంఖ్యలో భక్తులచే స్మరింపబడుతున్న భగవద్రామానుజాచార్యస్వామి ఆదర్శ ఆచార్యులుగా ప్రఖ్యాతులు. అసలు ఆచార్య అనే పదం వారికే వర్తిస్తుందని తస్మిన్ రామానుజార్యే గురురితి పదం భాతి నాన్యత్ర అనే మాట లోకంలో ప్రసిద్ధిమై నిలిచింది కూడా. వారి శిష్యులైన కూరేశులు ఆచార్య నిష్ఠాగరిష్ఠులు. వీరు ఎన్నెన్నో ఉత్తమ గుణాలను కలిగి ఉన్న ఆదర్శ శిష్యులు కూడా. భారతీయ వాఙ్మయ వైభవాన్ని ఖండఖండాంతరాల వారికి చాటిచెప్పిన వివేకానందులవారు, వారికి దిశానిర్దేశం చేసిన శ్రీరామకృష్ణ పరమహంస ఆదర్శ గురుశిష్యులుగా సుప్రసిద్ధులే. నేటి తరానికి చెందిన గురుశిష్యులు పూర్వులను ఆదర్శంగా గ్రహించి తమతమ రంగాల్లో ఖ్యాతిని ఆర్జించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.