ఆత్మవిశ్వాసానికి సలాం

ఇంగ్లండ్-ఫ్రాన్స్ మధ్య ఉండే ఇంగ్లిష్ చానెల్‌ను ఈదడమంటే గజ ఈతగాళ్లే భయపడుతుంటారు. అలాంటిది ఒక కాలు కోల్పోయి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈ మహిళ.. ఆ చానెల్‌ను ఈదేందుకు సిద్ధమైంది. ఇందుకు రోజూ సముద్రంలో ప్రాక్టీస్ చేస్తూ..తనకు కొండంత ఆత్మవిశ్వాసం ఉందని నిరూపిస్తున్నది.

ఇంగ్లండ్‌కు చెందిన ఈ ధైర్యశాలి పేరు వికీ గిల్బర్ట్. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే వికీకి 19యేండ్ల వయసప్పుడు కుడి కాలికి సిస్ట్ ఏర్పడింది. అయితే దానిని క్యాన్సర్ అనుకొని తప్పుగా నిర్ధారణ చేసుకున్న వైద్యులు ఆమె కుడి కాలు తీసేశారు. అయినా ధైర్యం కోల్పోకుండా పెండ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. మొదట్లో ఆ వ్యాధిని గుర్తించకపోవడంతో బాగా ముదిరిపోయింది. చివరిదశలో రొమ్ము క్యాన్సర్‌కు వైద్యం చేయించుకున్నది వికీ. బంధువులు, తెలిసినవాళ్లు బాధపడుతున్నా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. క్యాన్సర్‌ను జయించాలంటే వ్యాయామం ఒక్కటే సరైన పరిష్కారమని నమ్మింది. ఒంటికాలితో జిమ్‌లకు వెళ్లలేక స్విమ్మింగ్ చేయడం ప్రారంభించింది. చిన్న కాలువల్లో, సరస్సుల్లో చురుగ్గా ఈదడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎంతో కష్టతరమైన ఇంగ్లిష్ చానెల్‌ను ఒంటికాలితోనే ఈదేందుకు సిద్ధమైంది. ఈ వేసవిలో ఆ చానెల్‌ను ఈదేందుకు రిలే టీంను ఎంపిక చేశారు. అందులో వికీ కూడా ఉన్నది. అందరితో సమానంగా ఈదేందుకు ఇప్పటి నుంచే సముద్రంలో శిక్షణ తీసుకుంటున్నది వికీ. రొమ్మ క్యాన్సర్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆ వ్యాధి తిరగబెట్టకుండా ఉండేందుకు శారీరక కసరత్తు చేస్తున్నాను. ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంది అని చెబుతున్నది. ఈ విషయం తెలిసిన వారంతా.. నువ్ తప్పకుండా క్యాన్సర్‌ను జయిస్తావు అంటూ అభినందనలు తెలుపుతున్నారు.