రాజేంద్రప్రసాద్ వాయిస్‌తో..

రవిబాబు నటిస్తూ తెరకెక్కిస్తున్న ప్రయోగాత్మక చిత్రం అదుగో. అభిషేక్‌వర్మ, నభా నటేష్ జంటగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో ైఫ్లెయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు, నివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ పందిపిల్ల నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. పందిపిల్ల పాత్రకు నటుడు రాజేంద్రప్రసాద్ తన వాయిస్‌ను అందించారు. దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ పందిపిల్ల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా సాగే చిత్రమిది. ఈ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. బంటిగా పందిపిల్ల చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కీలక పాత్రధారి పందిపిల్ల సహజంగా కనిపించేలా లైవ్ యాక్షన్ 3డీ యానిమేషన్ టెక్నాలజీని ఉపయోగించాం. ఓ సినిమా కోసం ఈ టెక్నాలజీని వాడుకోవడం ఇదే తొలిసారి. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.