అమ్మ చేతివంట గుర్తుచేస్తున్న లియా, హర్ష

రోజూ ఒకే భోజనం చేసి బోర్ కొట్టిందా?మొన్నటి వరకు అమ్మమ్మ, నిన్నటివరకు అమ్మ చేతి వంట రుచి చూసి హోటల్ భోజనం చేయాలంటే విసుగొస్తున్నదా? ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా ఉండేవారందరిదీ ఇలాంటి పరిస్థితే. రోజూ హోటల్ భోజనం తినాలంటే విరక్తి. అందుకే టేస్టీ, టేస్టీగా మీకు ఆహారం అందించేందుకు వచ్చిందే మసాలా బాక్స్. మనం ఎక్కడున్నా సరే.. మన సిటీలో ఉన్న బెస్ట్ చెఫ్ తయారు చేసిన ఆహారం మన ఇంటి ముందుకు తీసుకు వస్తుంది. ప్రతిభావంతులైన చెఫ్‌లతో ప్రతీ రోజు, మనం కోరుకున్న డిష్‌ను ఇంటికి, ఆఫీసుకు అందించే ప్రయత్నం చేస్తున్నారు మసాలా బాక్స్‌డాట్ కమ్ నిర్వహకులు. కేరళలో ప్రారంభమైన వారి సేవలు తొమ్మిది రాష్ర్టాలకు విస్తరించాయి. త్వరలోనే మరిన్ని రుచులు అందిస్తామంటున్న మసాలా బాక్స్ వ్యవస్థాపకులు హర్ష ధాచరే, లియా సుసన్‌ల సక్సెస్‌మంత్ర ఇది.

టెస్టీ ఫుడ్ కోసం ప్రయత్నించి..

లియా బెంగళూర్ జ్యోతి నివాస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్. మసాలా బాక్స్ పారంభించడానికి ముందు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో పని చేసేవారు. అంతకు ముందు లియా, హర్షలు గర్భవతులుగా ఉన్నప్పుడు, రుచికరమైన భోజనం కోసం ప్రయత్నించడం,మంచి టేస్టీ ఫుడ్ లేకపోవడం కొరతగా అనిపించింది. కేవలం రెస్టారెంట్లు మాత్రమే హోమ్ డెలివరీ ఇచ్చేవి. అయితే ఆ భోజనం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదనే ఆలోచన వచ్చింది. మొదలైన మా అన్వేషణ... మేమే సొంతంగా స్వచ్ఛమైన ఇంటి ఆహారం అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా గృహ ఆహార పంపిణీ ఆలోచనపై చర్చించాం అంటారు మసాలా బాక్స్ కో ఫౌండర్ హర్ష. ఆరు నెలల్లోనే కొచ్చిలో ఆహార పంపిణీ ప్రారంభించాం. అనతి కాలంలోనే దాదాపుగా 3500 మందికి భోజనం అందించే విధంగా అభివృద్ధి చేశాం అంటారు హర్ష.

విద్యార్థులకు, ఉద్యోగులకు..

ఇంటి నుంచి దూరంగా ఉండే విద్యార్థుల కైతే మసాలా బాక్స్ వంటకాలు చాలా ఉత్తేజాన్నిస్తున్నాయి. ఇంటిపై బెంగ ఉండే వారికి అమ్మ వండే వంటలోని కమ్మదనం రుచి చూపిస్తున్నారు. సాధారణంగా హాస్టల్ ఫుడ్ పై ఆసక్తి లేని వారు మంచి ఆహారం కోసం మసాలా బాక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూమ్స్‌లో ఉండే వాళ్లు.. నెలవారి ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నారు. కొచ్చిలోని పలు ఇళ్లకు ఇంటిలో తయారుచేయబడిన ఆహార పదార్థాలను మసాలా బాక్స్ అందిస్తున్నది. సంస్థ అందిస్తున్న సేవలతో ఎన్నారైలు చాలామంది డెయిలీ కస్టమర్లుగా మారిపోయారు. దాదాపుగా అన్ని ఇంట్లోనే శుభ్రంగా తయారుచేయడంతో రుచిలో ఎలాంటి తేడా రాకుండా చూసుకుంటున్నారు.

స్నేహం కలిపిన వ్యాపారం

హర్షతో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మావారు, హర్ష భర్త స్నేహితులు కావడంతో మా దోస్తీ కుదిరింది. మరో వైపు మా పిల్లలకు సేమ్ ఏజ్ గ్రూప్ కావడంతో దోస్తీ ఈజీ అయిపోయింది. దీంతో రెండు కుటుంబాలు అనేక విషయాల్లో కలిసి చర్చించుకోవడం, చాలా సమయం సరదాగా గడిపేవాళ్లం. అలా స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందని లియా చెప్పుకొచ్చింది. కొచ్చిలో వరుసగా వస్తున్న ఆఫర్లతో హర్ష ఇంటి వద్ద నుంచే సంస్థను ప్రారంభించారు. ఆమె భర్త గేమింగ్ కంపెనీలో బిజీ బిజీగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు మసాలా డాట్‌కమ్‌తో తీరికలేకుండా గడిపేస్తున్నారు.

కేరళ నుంచి కర్ణాటక దాకా

వరుస విజయాలతో ఊపు మీద ఉన్న లియా, హర్షలు 15 మంది హోమ్ చెఫ్‌లతో కేరళ తర్వాత బెంగళూర్‌లో కార్యకలాపాలను ప్రారంభించారు. కొచ్చిలో ఉన్న మసాలా బాక్స్‌లో 45 మంది చెఫ్‌లు సేవలు అందిస్తున్నారు. మరో పు బెంగళూర్‌లో 200 మంది టాప్ చెఫ్‌లు నిరంతరం సేవలు అందిస్తున్నారు.

అరిసెలు, పూతరేకులు, జంతికలు, కారంపూస, బొబ్బట్లు, గారెలు, మైసూరుపాక్ ఇలా చెబుతూ పోతే లిస్టు చేంతాడంత అవుతుంది. వినేవారి నోరూరుతుంది. సాంప్రదాయ పిండివంటలకున్న ప్రాధాన్యం అలాంటిది. తెలుగు లోగిళ్లలోనే కాదు పక్క రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక ఇలా ప్రతీ ప్రాంతంలో వారి వారి ప్రత్యేక వంటకాలున్నాయి. వీటిని ఇంటిలో తయారు చేయడానికి ఎంతో ప్రయాస పడాలి. అలాంటి ఆయాసం లేకుండా చేయడానికే ఇప్పుడు ఎన్నో ఫుడ్ స్టార్టపులున్నాయి. అలాంటి వాటిలో మసాలా బాక్స్ కూడా ఒకటి.

ఇంటి నుంచే ఆర్డర్లు..

హోమ్ ఫుడ్ కావాల్సిన వినియోగదారుడు వెబ్ సైట్ నుంచి కానీ మొబైల్ అప్లికేషన్ ద్వారా, ముందుగానే ఆర్డరు బుక్ చేసుకొనే అవకాశం ఉంది. స్టాకును బట్టి ఆన్‌లైన్‌లోనే ఆర్డరు చేసుకోవచ్చు. వారి ఆర్డర్లకు తగ్గట్టుగానే ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకపోవడంతో పాటు వారి హోమ్-చెఫ్స్ రుచి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారని, సాధారణంగా ఒక రోజులో మాత్రమే అమ్ముడయ్యే పరిమాణంలో మాత్రమే వంటకాలు సిద్ధం చేస్తున్నామని హర్ష చెబుతారు.

అనేక జాగ్రత్తలు

మసాలా బాక్స్ ప్యాకేజింగ్ మెటీరియల్, ఆహార సరఫరా విషయంలో జాగ్రత్త తీసుకుంటుంది. భోజనం, స్పిల్-ప్రూఫ్ మైక్రోవేవ్-లాంటి సేఫ్ మొక్కల ఫైబర్స్ నుంచి బాక్స్‌లు తయారు చేస్తారు. వెదురు, చెరకు వంటి మొక్కలతో తయారు కావడంతో నేరుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని ప్లాస్టిక్, కాగితం రీసైకిల్ పదార్థాల నుంచి తయారు చేస్తారు. కొచ్చిలో ఆరు నెలల్లో 260 రకాల వివిధ వంటల రుచులు చూపించామని చెబుతున్నారు. వినియోగదారులు మా మెనునూ ఎప్పటికీ విసుగు చెందరు. నాణ్యతతో పాటు కొత్త రకాల ఫుడ్ ఐటెమ్స్ మా బిజినెస్ పెరగడానికి కారణమవుతుందనిహర్ష వివరిస్తుంది.

అమ్మమ్మ వంటే...

మసాలా బాక్స్ బాగావండి వడ్డిస్తుంది ఇది నా కిచెన్ అమ్మమ్మను నాకు గుర్తుచేస్తుంది అనే ఆలోచనను ప్రజల్లో తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని మసాలా బాక్స్ టీమ్ చెబుతున్నది. వినియోగదారుడి ఫోన్ కాల్ అందిన వెంటనే సేవలు, అవసరమైన ఆహారం అందిస్తూ ఉండడంతో ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తొంది. వారు రాబోయే ఐదు సంవత్సరాలలో తొమ్మిది నగరాల్లో విస్తరించాలన్నది లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాలకు వారి సేవలు విస్తరించారు. మరిన్ని నగరాలకు విస్తరించడమే లక్ష్యమని భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తున్నారు లియా.

క్వాలిటీకే ప్రాధాన్యం

సేవలు పెరిగినప్పటికీ క్వాలిటీలో ఎలాంటి రాజీపడమంటున్నారు లియా, హర్ష. హోమ్-చెఫ్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియ విస్తృతం కావడంతో.. మెనూ తయారు చేయడంలోనూ... క్వాలిటీ విషయంలో ఓ ప్యానెల్ రూపొందించాం. మసాలా బాక్స్ ప్యాకింగ్ చేసే ముందు ప్యానెల్ రుచి బాగుందని భావిస్తేనే కస్టమర్ ఇంటికి పంపిస్తారు. ఎంపిక అయిన ఆహారాన్ని ఫొటోషూట్ కూడా చేసి వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తామని చెబుతున్నారు. ఈ ఫొటోలు చూడడానికి సైట్‌లో అందంగా పెడుతారు. మరో వైపు చెఫ్‌ల వంటగది తనిఖీ చేసి.. చట్టబద్దమైన ఆమోదాలను ఉన్న తర్వాతే వారికి అనుమతి ఇస్తారు. మేంమసాలా బాక్స్ కింద ఏదో కమర్షియల్‌గా ఉన్న చెఫ్‌లను తీసుకురావడం ఇష్టం లేదు. ఇళ్లలో ఉండే మహిళలు తయారు చేసిన వంటలు రుచికరంగా ఉంటాయంటారు హర్ష. అంతేకాదు.. మంచి రుచికరంగా తయారు చేసే ఎవరైనా మసాలా బాక్సును సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. మహిళలే వంటలు తయారు చేయడం మాకు అదనపు ఉపయోగం. ఒకసారి అప్లికేషన్ లాంచ్ చేసుకుంటే.. వారి అవసరాలును గమనిస్తూ సేవలు అందిస్తాం అంటున్నారు హర్ష.