అక్రమ నిర్మాణాలు కడితే బ్లాక్‌లిస్టు..

-కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులను కూడా.. -అక్రమంగా అంతస్తులు వేస్తే.. అంతే సంగతులు -నిబంధనల్ని పాటించకుంటే ఉపేక్షించరు
అక్రమ నిర్మాణాల్ని చేపట్టే బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇందుకు సహకరించే ఆర్కిటెక్టులను బ్లాక్‌లిస్టు చేసే మార్గదర్శకాల్ని కేంద్రం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఇది అమల్లోకి వస్తే.. అక్రమ నిర్మాణాల్ని కట్టడానికి ఎవరూ సాహసించరంటే నమ్మండి. ఇటీవల ముంబైలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నలుగురు అమాయకులు సజీవ దహనం కావడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదంటే అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యల్ని తీసుకోవాలని ఆదేశించింది. దీంతో కేంద్రం అక్రమ నిర్మాణాలకు కారకులైన వారికి బ్లాక్‌లిస్టులో పెడతామని సుప్రీం కోర్టుకు విన్నవించింది. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్కులపై చర్యల్ని తీసుకునే మార్గదర్శకాల్ని సిద్ధం చేశామని.. జస్టీస్ మదన్ బి లోకూర్, అబ్దుల్ నాజీర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనానికి తెలియజేసింది. అక్రమ నిర్మాణాల్ని ఉపేక్షించకూడదని అన్ని రాష్ట్రాలకు సమాచారాన్ని కూడా అందించామని వివరించింది. ఈ నిబంధనలపై కోర్టు ఆమోదముద్ర వేస్తే తక్షణమే అమల్లోకి తెస్తామన్నది.