అక్కడ ఆడపిల్లలు ఆదిపరాశక్తులు! వీరే మనకు ఆదర్శం

విద్యావంతులైనా కూడా కొందరు వారు కూడా ఈ కాలంలో ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే గర్భంలో ఉండగానే చిదిమేస్తున్నారు. కానీ, ఉత్తరపదేశ్‌లోని జోగిడేరా గ్రామవాసులు మాత్రం అక్షరం ముక్క రాకపోయినా ఆడపిల్లలను ఆరాధిస్తున్నారు. ఆ గ్రామంలోని వారందరూ అమ్మాయే పుట్టాలని పూజలు కూడా చేస్తుంటారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిని వారు ఎంతో బాగా ఆరాధిస్తారు. ఎందుకంటే ఆడపిల్లంటే వారికి అంత ఇష్టం మరి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సమీపంలోని జోగిడేరా (బిల్హూర్) అనే గ్రామవాసులు 15వ శతాబ్దం నుంచే ఆడపిల్లలను సంరక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడపిల్లల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో, బేటీ పడావో పథకానికి సంబంధించిన ప్రచారాన్ని జోగిడేరా గ్రామంలో చేయాల్సిన అవసరమే రాలేదు. ఆ గ్రామంలోని వారందరూ పాములు ఆడించుకునే తమ పొట్టపోసుకుంటారు. ఈ వృత్తిలో ఉండే వారంతా ఆడపిల్లలను ఆదిపరాశక్తిగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు, వారు మహిళలను సాక్షాత్తూ శివుని భార్య అయిన పార్వతీదేవితో సమానంగా చూస్తారు. పాములను ఆడించే వృత్తిలో ఉన్న వారందరూ ఆడపిల్లలే పుట్టాలని కోరుకుంటారు. విషపూరితమైన తాచుపాముల నుంచి తమను రక్షించేది పార్వతీ రూపంలో ఉన్న మహిళలేనని భావిస్తారు. అటువంటి వారిని ఆరాధించడం వల్ల తమకు మేలు జరుగుతుందని జోగిడేరా వాసులు అంటున్నారు.
ఆ గ్రామంలో యువకులకు పెండ్లి కావాలంటే తప్పనిసరిగా అతనికి ఓ చెల్లి గానీ, అక్కగానీ ఉండాలి. లేదంటే ఇక వారందరూ జీవితాంతం పెండ్లి లేకుండా ఉండాల్సిందే. ఈ వింత ఆచారం ఇప్పటిది కాదు. వారి పూర్వీకుల నుంచి ఇలాగే కొనసాగుతున్నది. ఆడపిల్లను రక్షించడం వల్ల తమకు మంచి జరుగుతుందని, భావించి స్త్రీల సంఖ్యను పెంచేందుకు మొక్కులు, పొర్లుదండాలు పెడుతుంటారు. పాములు ఆడించే వారిలో ఇది వింతైన ఆచారంగా కనిపించినప్పటికీ ఆడపిల్లలను చిన్నచూపు చూసేవారందరికీ ఆ గ్రామవాసులంతా కనువిప్పు కలిగిస్తున్నారు. ధనికులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో చాలామంది నేడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. విద్యలేని వాడు వింత పశువు అంటారు. కానీ అక్షరాస్యత లేకపోయినా తమ పూర్వీకులు ఆచరించిన మంచి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు జోగిడేరా వాసులు. 15వ శతాబ్దంలో ఇదే కమ్యూనిటీకి చెందిన గోరఖ్‌నాథ్ అనే ముని చెప్పడంతో అప్పటి నుంచి ఆయన శిష్యులు ఈ ఆనవాయితీని అనుసరిస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆ కుటుంబంలో అందరికీ పండుగే. కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. ఆ గ్రామస్తులకు ఆడపిల్ల అంటే గౌరవమేకాదు, ఎంతో ఆప్యాయంగా కూడా చూసుకుంటారు. మగాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మహిళలు ఎదురు రావాల్సిందే. లేకపోతే ఆ రోజు వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటారట. ఎన్నో ఏండ్ల నాటి ఆచారాన్ని పాటించడం వల్లే తామంతా సుఖ, సంతోషాలతో ఉండగలుగుతున్నామని పాములు ఆడించే వృత్తి సంఘానికి నాయకుడైన శంషీర్‌నాథ్ చెబుతున్నాడు. రాజరిక పాలన సమయంలో తమ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పూర్వీకులు జీవించగలిగారని ఆయన తెలిపాడు. బ్రిటిష్ పరిపాలనలోనూ తమ వృత్తి ఎంతో బాగా వెలిగిందని, ఆ కాలంలో తాడుతో చేసే విన్యాసాలను అందరూ ఆసక్తిగా తిలకించి బహుమానాలు కూడా అందించేవారని శంషీర్‌నాథ్ అంటున్నాడు. శివాజీ, మహారాణా ప్రతాప్ వంటి వారందరూ ఎక్కడ మహిళలను ఆరాధిస్తారో అక్కడ అందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లుతారని చెప్పేవాళ్లు. చెప్పడమే కాదు అదే ఆచారాన్ని వారు కూడా పాటించి మార్గదర్శకంగా నిలిచారు. అలాగే ఎన్నో శతాబ్దాలు గడిచినా తమ పూర్వీకులు ఆరంభించిన ఆనవాయితీని ఆధునిక యుగంలోనూ కొనసాగిస్తున్నారు జోగిడేరా గ్రామస్తులు.