అంతరిక్షంలోకి ప్రేమలేఖలు!

జపాన్‌కు చెందిన ఓ సంస్థ కొత్తగా పెండ్లి చేసుకునే వారికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ జ్ఞాపకాన్ని బహుమతిగా ఇవ్వనుంది. అదే స్పేస్ లవ్. ఇందులో నూతన వధూవరుల పేర్లను, ప్రేమ సందేశాలను ఫలకాల ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నది.

నవ దంపతులు తమ ప్రేమను అంతరిక్షంలోనూ ప్రదర్శించుకునే వినూత్న అవకాశం కల్పిస్తామని జపాన్‌కు చెందిన ఓ సంస్థ చెబుతున్నది. వధూవరుల పేర్లు, ప్రేమ సందేశాలు రాసిన ఫలకాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వదిలే సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపింది. జపాన్‌లోని త్సుకుబా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు ప్రారంభించిన వార్ప్ స్పేస్ అనే స్టార్టప్ సంస్థ ఈ సేవలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. 16 మిల్లీమీటర్ల పొడవు, 8 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే టిటానియం ఫలకాల మీద నవ దంపతుల పేర్లను, ప్రేమ సందేశాలను రాసి ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఆ ఫలకాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి వ్యోమగాములు బయటకు వదిలిపెడతారు. అంతేకాదు, వాటిని విడిచి పెడుతున్నప్పుడు ఫొటోలు తీసి ఆ దంపతులకు పంపిస్తారు. ఇక అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలతో పాటే ఈ ఫలకాలు కూడా కక్ష్యలో తిరుగుతాయి.

నవదంపతులు ఎక్కువమంది ఆసక్తి చూపితే.. ఆ ఫలకాల పరిమాణాన్ని కూడా పెంచుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు వార్ప్‌స్పేస్ సంస్థ ఒక్కో ఫలకానికి రూ.18,543 (30 వేల యెన్)లు వసూలు చేయనున్నది. ఇలా ఫలకాలు పంపేందుకు జపాన్‌కు చెందిన ప్రయోగాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (కిబో)తో కలిసి పనిచేస్తున్నది వార్ప్ స్పేస్. అయితే, 2019లో తొలిసారిగా ఫలకాలను పంపించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.. అవేంటంటే? త్సుకుబా నగరంలోని ఒకురా ఫ్రాంటియర్ హోటల్‌లో పెళ్లి చేసుకున్న నవ దంపతులకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. అందులోనూ 2019 ఫిబ్రవరిలోగా వివాహం చేసుకున్నవారికి మాత్రమే. కొత్త జంటలకు చిరకాల జ్ఞాపకం మిగిల్చాలన్న ఆలోచనతో ఇలా చేస్తున్నామని వార్ప్ స్పేస్ అధ్యక్షులు తోషిహిరో చెబుతున్నారు.