అంకిత కోరిక నెరవేరింది!

చిన్నప్పట్నుంచీ పైలెట్ అవ్వాలన్నకోరికతో బ్యాంక్‌లో లోన్ తీసుకొచ్చీ మరీ చదివింది. ఎన్ని సార్లు ప్రయత్నించిన ఉద్యోగం రాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు బాధకలిగించేవి. సహనం కోల్పోకుండా ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ బస్సు, రైలు, మరుగుదొడ్లు, భోజనం సమయంలో సమయాన్ని వృథా చేయకుండా చదివీ, కోరికను నెరవేర్చుకుంది.

ముంబైకి చెందిన అంకితకు చిన్నప్పట్నుంచీ పైలెట్ అవ్వాలని కోరిక ఉండేది. కోరికగా మిగలిపోకుండా నిజం చేయాలనుకుంది. అదే మాటని అంకిత తల్లిదండ్రులకు చెప్పింది. పైలెట్ చదువుకు 25 లక్షలు కావాలి. అంత స్థోమత తండ్రికి లేదు. అంకిత ఆశయం ముందు పేదరికం వెనుకడుగు వేసింది. బ్యాంక్‌లో లోన్ తీసుకొని ట్రైనింగ్‌లో చేరింది అంకిత. కొన్నిరోజులకు ట్రైనింగ్ పూర్తయింది. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించిన రాలేదు. ఆడపిల్లను చదివించడం అనవసరం అని ఇరుగుపొరుగు వాళ్లు అనడంతో భరించలేకపోయింది. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఉద్యోగం కోసం నాలుగు సార్లు ప్రయత్నించింది. కానీ విఫలమయింది. ముందు చేసిన లోపాలను కనుక్కొని ఐదవ సారి రాసిన పరీక్షలో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా పైలెట్‌వైపు అడుగులు వేసింది. 12 గంటలు పాటు ఉద్యోగం, మూడు గంటలు ప్రయాణానికే సమయం సరిపోయేది. ఉన్న సమయంలో చదివితే పైలెట్ అవ్వడం కష్టమనిపించింది. సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పోస్టులు పడుతాయని తెలిసి అంకిత ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు, రైలు, మరుగుదొడ్లు, భోజనం చేసేటప్పుడు ఎప్పుడుపడితే అప్పుడు ఖాళీ సమయంలో తీరిక లేకుండా చదివింది. చివరికి పైలెట్ అయింది. మొదటిసారి విమానాన్ని నడిపే సమయంలో ప్రయాణికుల ముందు గర్వంగా నిల్చుంది. పైలెట్‌ను ఒక మహిళ నడుపుతుందని తెలిసిన ప్రయాణికులు అంకితను అభినందిస్తున్నారు.